రేపు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద ఏర్పాట్లు పూర్తి
గజ్వేల్, సెప్టెంబర్ 16: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో రేపు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ(Sri Potuluri Veerabrahmendra Swamy Temple Committee) ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆర్ అండ్ కాలనీ సమీపంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో భాగంగా పుణ్యాహవచనము, విశ్వకర్మ పరమాత్మకు షోడ శోపచార పూజలు, పంచ యజ్ఞగుండములతో విశ్వకర్మ యజ్ఞం, వీరబ్రహ్మేంద్ర స్వామికి, మహామాయ(మమ్మాయి) దేవికి ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కొక్కొండ శ్రీనివాస ఆచార్య, కమిటీ సభ్యులు తెలిపారు.
యజ్ఞ, పూజ కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని పురాతన వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఎన్నో ఏళ్లుగా భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోందన్నారు. అన్నింటికన్నా ముందు విశ్వకర్మ పరమాత్మ ఆవిర్భవించారని, విశ్వకర్మ పరమాత్మ సకల దేవతలను, జీవులను సృష్టించారన్నారు. విశ్వకర్మ పరమాత్మ అందరికీ ఆరాధ్యుడేనని ఆయన అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే మానవ జన్మకు సార్థకత లభిస్తుందన్నారు.
గజ్వేల్ వీరబ్రహ్మేంద్రస్వామి గుట్ట ఎంతో చరిత్ర కలదని, సిద్ధ వైద్యుడు గుడ్డోజి పెంటయ్య ఆచార్య వీరబ్రహ్మేంద్రస్వామి గుట్టపై స్వామివారి విగ్రహాన్ని మహామాయ, హనుమాన్ విగ్రహాలను చెక్కి పూజించేవారని, ఎంతోమంది వివిధ రోగాలతో బాధపడే వారు ఇక్కడికి వచ్చి వైద్యం ద్వారా స్వస్థత పొందారని వెల్లడించారు. ఇప్పటికీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద ఎందరో భక్తులకు గొప్ప గొప్ప అనుభవాలు కలుగుతున్నాయన్నారు. గురువారం నిర్వహించే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఆలయాన్ని పునర్నిర్మించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించామని, ఇందుకు భారీగా నిధులు అవసరమవుతున్నందున దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు స్వామి ఆచార్య, ప్రధాన కార్యదర్శి అరునోజీ లక్ష్మీ నరసింహ ఆచార్య, కోశాధికారి గడియారం నాగరాజు ఆచార్య, ప్రచార కార్యదర్శి అరునోజీ శ్రీనివాస్ ఆచార్య , సభ్యులు ఇటిక్యాల లక్ష్మణ్ ఆచార్య, విశ్వకర్మ మనుమయ సంఘం అధ్యక్షులు గడియారం వెంకట ఆచార్య, ఉపాధ్యక్షులు గడియారం వెంకటేశం ఆచార్య , ప్రధాన కార్యదర్శి ముత్యాల విఠల్ ఆచార్య, గుడ్డోజు వెంకటేశం ఆచార్య, సంకోజీ రమేష్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.