పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి
నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
రామగుండంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశంలో సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేశం
పెద్దపల్లి (విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Police Commissioner Amber Kishore Jha) అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, చట్టప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో సెప్టెంబర్ నెల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్, డివిజన్, జోన్ల వారీగా పెండింగ్ కేసుల స్థితిగతులను సమీక్షించారు. నిందితుల అరెస్టులు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, అభియోగపత్రాల దాఖలు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన
ప్రతి పోలీస్ అధికారి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి తన సిబ్బంది పనితీరు, ప్రవర్తన, విధుల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నేర సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు చేపట్టాలని, అవసరమైన సందర్భాల్లో కేసులు నమోదు చేసి వీడియో రికార్డింగ్, సాక్షుల విచారణ, ఆధారాల సేకరణతో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని తెలిపారు. సరైన చట్టపరమైన కారణం లేకుండా ఎవరినీ పోలీస్ స్టేషన్‌కు పిలవరాదని స్పష్టం చేశారు.
అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం
గంజాయి అక్రమ రవాణా, వినియోగం, ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం అక్రమ రవాణా, గుడుంబా తయారీ, అక్రమ ఇసుక రవాణా, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా పెంచి తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల నియంత్రణ, నకిలీ విత్తనాల కేసుల్లో నిందితులపై చట్టప్రకారం నిర్బంధ చట్టం అమలుకు చర్యలు చేపట్టాలని, నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యం
తీవ్రమైన నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. దొంగతనాలు, గొలుసు దొంగతనాలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, నిందితులను త్వరగా పట్టుకునేందుకు స్థానిక పోలీసులు, నేర పరిశోధన విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాత్రి వేళల్లో గస్తీని మరింత పటిష్టం చేయాలని, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాహన తనిఖీలు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
దుర్గామాత ఉత్సవాలకు పటిష్ట భద్రత
దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జన శోభాయాత్ర ముగిసే వరకు నిర్వాహకులు, ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు.
మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతి మండప నిర్వాహకుడి వివరాలను సేకరించి, మండపాల వద్ద తప్పనిసరిగా పాయింట్ పుస్తకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కీలక ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, అదనపు డీసీపీ కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ సీహెచ్. శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్‌తో పాటు పలువురు సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.