జిల్లాలో రైతుల పంటలు కాపాడేందుకు ఎస్సారెస్పీ నీటి విడుదల
- చివరి తడి అందించి అన్నదాతకు అండగా నిలుస్తాం
- రైతుల ప్రయోజనాలే ముఖ్యం.. సాగునీటి కోసం ప్రభుత్వాన్ని ఒప్పించాం
- ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): రైతుల కష్టాలను గుర్తించి, చేతికొచ్చిన పంటలు ఎండిపోకుండా చివరి తడి అందించాలనే లక్ష్యంతో ఎస్సారెస్పీ నుంచి సాగునీటి విడుదలకు కృషి చేశామని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు(Peddapalli MLA Chintakunta Vijaya Ramana Rao) తెలిపారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, పంటలను కాపాడేందుకు ఎంతటి ప్రయత్నమైనా చేస్తామని స్పష్టం చేశారు.
శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి ప్రధాన కాలువ వద్ద డి-83, డి-86 కాలువల ద్వారా పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు సరఫరా అవుతున్న సాగునీటిని స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. కాలువల్లో నీటి ప్రవాహం, పంటలకు చివరి తడి అందించాల్సిన అవసరంపై అధికారులతో, నాయకులతో వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలకు నీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నేతృత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో సంప్రదింపులు జరిపి ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలకు అంగీకారం పొందామని వివరించారు.
నీటి లభ్యత పరిమితంగా ఉన్నప్పటికీ రైతుల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుందని పేర్కొన్నారు. పంటలు చేతికొచ్చే కీలక సమయంలో చివరి తడి అందితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, అన్నదాతల శ్రమ వృథా కాకుండా చూడటమే తమ లక్ష్యమని తెలిపారు.
రైతుల పక్షాన నిలబడటమే మా బాధ్యత
సాగునీటి విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ భరోసా ఇచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని, ఆ బాధ్యతను గుర్తించి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. సాగునీటి విడుదలపై ప్రతిపక్షాలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా అనవసర విమర్శలు చేస్తున్నాయని అన్నారు.
రాజకీయ విమర్శల కంటే రైతుల పంటలను కాపాడటం, వారికి సాగునీరు అందించడం ముఖ్యమని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం, పంటల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నదాతలకు అండగా నిలుస్తూ వారి ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని విజయరమణ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.