పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి
సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్
సుల్తానాబాద్ అక్టోబర్ 26 (విజయ క్రాంతి): పోక్సో చట్టం(POCSO Act)పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్(Sultanabad Junior Civil Judge Durgam Ganesh) అన్నారు. సోమవారం పాన్ ఇండియా సురక్షిత్ బచపాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జడ్పీ హైస్కూల్ (బాలికల) లో న్యాయ విజ్ఞాన సదస్సు(Legal awareness camp) నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 31 వరకు పోక్సో చట్టం పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. 18 సం.ల లోపు బాల బాలికలకు పోక్సో చట్టం వర్తిస్తుందని, చట్టంలో పొందుపరిచిన అంశాల ఆధారంగా బాల బాలికలకు రక్షణ ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బాలికలకు ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే మండల న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించినట్లయితే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి అవునూరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఆవుల శివకృష్ణ, న్యాయవాదులు ఆకారపు సరోత్తం రెడ్డి, బొయిని భూమయ్య, సామల రాజేంద్ర ప్రసాద్, వేముల స్నేహ, స్కూల్ ప్రిన్సిపాల్ దివాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.