చాకలి ఐలమ్మ పోరాటం చిరస్మరణీయం
గంభీరావుపేట, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ(Chakali Ilamma) చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ-నర్సాగౌడ్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన తిరుగుబాటు తెలంగాణ ధీరత్వానికి ప్రతీకమని పేర్కొన్నారు. బహుజనుల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లు గారి నర్సాగౌడ్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మండల అధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్, పాపగారి వెంకటస్వామి గౌడ్, కోడె రమేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.