స్వచ్ఛతలో బస్వాపూర్ సంచలన ముందడుగు
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామం జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లాలో మొట్టమొదటిసారిగా గ్రామంలోని ప్రతి ఇంటికీ నాలుగు చొప్పున చెత్తబుట్టలను(dustbins ) అధికారులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి చొరవతో ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ–2026 విధానంలో భాగంగా ఇంటి వద్దే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని అధికారులు సూచించారు. వేరు చేసిన చెత్తను మాత్రమే సిబ్బంది సేకరిస్తారని, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చెత్తను వేరు చేయడం ద్వారా గ్రామ పరిసరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని అధికారులు అవగాహన కల్పించారు.