కరెంటు కోతలు - రైతుల అవస్థలు
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో కరెంట్ కోతలతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామ రైతులంతా సర్పంచ్ చిగురు నరేష్ కు తమ సమస్యలు తెలిపారు. తరుచూ విద్యుత్ సమస్య ఏర్పడుతుందని ఇలాగైతే పంటలు ఎండి పోవడం జరుగుతుందని వరి పొట్టదశలో ఉందని ఈ సమయంలో నీటి వినియోగం ఎక్కువగా అవసరం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక పెట్టుబడి పెట్టి నాట్లు వేశామని కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండి పోకుండా విద్యుత్ అధికారులకు మీ ద్వారా మా సమస్య తెలియజేసి నిరంతరం విద్యుత్ అందించేలా కృషి చేస్తూ రైతులను ఆదుకోవాలని సర్పంచ్ ను కోరారు.
విద్యుత్ సమస్యతో వ్యవసాయ రంగానికి చాలా ఇబ్బంది కలుగుతుందని,లో వోల్టేజ్ కారణంగా నెలకు రెండు సార్లు మోటార్లు కాలిపోయి పొలాలు బీడు వారుతున్నాయని రైతులు వాపోయారు.ఈ యేడు వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల చెరువులు కుంటల్లో నీళ్లు లేవని, కనీసం కరెంటు అయినా ఉంటదంటే కోతలతో సతమత మవుతున్నామని రైతులు పేర్కొన్నారు.వెంటనే విద్యుత్ సమస్య పరిష్కరించాలని కోరారు.