జాతీయ లోక్ అదాలత్ కు అనూహ్య స్పందన
- 7,549 క్రిమినల్ కేసుల పరిష్కారం
- ప్రభుత్వ శాఖల సహకారంతో అర్హులకు సంక్షేమ, ఉపాధి, శిక్షణ
సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 36 సివిల్, 7,549 క్రిమినల్, 28 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు రాజీ ద్వారా పరిష్కారమయ్యాయి. శనివారం సిద్దిపేట జిల్లా కోర్టుతోపాటు దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాల ద్వారా రూ. కోటి 34 లక్షల 5 వేలు మేరకు రాజీ కుదిరింది. సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి జి.సుదర్శన్ మాట్లాడుతూ... సమయం, డబ్బు వృథా కాకుండా సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు.
లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసుల పరిష్కారంతో పాటు, ప్రభుత్వ శాఖల సహకారంతో అర్హులైన వారికి వివిధ సంక్షేమ, ఉపాధి, శిక్షణ కార్యక్రమాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దివ్యాంగజన్ కౌశల్ వికాస్, దివ్యాంగజన్ రోజ్‌గార్ సేతు కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమం, పింఛన్ కోసం దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఉపాధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమర్థనం ట్రస్ట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, వేదాస్ సొల్యూషన్స్, మెడిప్లేస్, ఆర్ఎస్ఈటీఐ సంస్థల ప్రతినిధులు పాల్గొని 175 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా, 30 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.
అదేవిధంగా లీడ్ బ్యాంక్ ద్వారా అర్హులైన వారికి రుణ సదుపాయాలను పొందే అవకాశాన్ని కూడా కల్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామీణ అభివృద్ధి శాఖ, సంక్షేమ శాఖ, ఉపాధి కల్పన శాఖ, లీడ్ బ్యాంక్ స్టాళ్లను జిల్లా జడ్జి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోష్ కుమార్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎ.కుమారస్వామి, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి బి.సాధన, ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, జిల్లా సంక్షేమ అధికారి సి.శారద, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సుధీర్, జిల్లా ఉపాధి అధికారి ప్రియాంక, ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ గెము నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. హరిబాబు, న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.