పరిశుభ్రతే నగర నాగరికతకు తొలి చిరునామా
శాసనసభలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
కోదాడ,(విజయక్రాంతి): పట్టణ పరిశుభ్రత, మహిళల సౌకర్యాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం అవసరమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Uttam Padmavati Reddy) అన్నారు. శనివారం శాసనసభలో 'కోర్ అర్బన్ రీజియన్ బిల్లు-2026'(Core Urban Region Bill-2026)పై చర్చలో ఆమె మాట్లాడుతూ... ప్రతి అర కిలోమీటరుకు ఆకర్షణీయమైన, శాస్త్రీయ వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మనిషి ఉన్న ప్రతి చోటా ప్రతిరోజూ వ్యర్థం ఉత్పత్తి అవుతుందని, అందువల్ల వ్యర్థాల నిర్వహణ అప్పుడప్పుడు చేపట్టే కార్యక్రమంగా కాకుండా నిరంతరాయ వ్యవస్థగా ఉండాలి.
రోడ్ల పక్కన చెత్త కుప్పలు ప్రజారోగ్యం, నగర సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పట్టణ ప్రణాళికలో మహిళల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మహిళలు బయటకు వచ్చినప్పుడు సురక్షిత మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇది వారి ఆరోగ్యం, గౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. కొత్తగా నిర్మించే ప్రతి షాపింగ్ కాంప్లెక్స్, వాణిజ్య భవనంలో మహిళల కోసం కనీసం 6x6 అడుగుల ప్రత్యేక మరుగుదొడ్డిని తప్పనిసరి చేయాలని, దీనిని భవన అనుమతుల్లోనే నిబంధనగా చేర్చి నిర్వహణ బాధ్యత యాజమాన్యానికే అప్పగించాలని ప్రతిపాదించారు.