రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రాధాన్యత
* నామాపూర్ లో తొలి ఐకెపి కేంద్రం.
* ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అనిల్
* రైతుల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం
* ప్రభుత్వం గిట్టుబాటు ధర అందిస్తుంది
* కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జల రాజు
ముస్తాబాద్,అక్టోబర్ 24( విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో జిల్లా లోనే ఈ యేడు తొలి (ఐకెపి)వడ్ల కొనుగోలు కేంద్రాన్ని(Paddy purchasing center) సర్పంచ్ మాదాసు అనిల్ ప్రారంభించారు. ముస్తాబాద్ తహసీల్దార్ ఫారుక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి,నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలోనే తొలి ఐకేపీ కేంద్రాన్ని నామాపూర్‌లో ప్రారంభించడం హర్షనీయమన్నారు.
రైతులు తమ ధాన్యాన్ని ఊరిలోనే విక్రయించుకునే సదుపాయం కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. కేంద్రంలో తూకం,గన్నీ బ్యాగులు, హమాలీలు, ధాన్యం తరలింపు వంటి ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ పాలకవర్గం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల(Farmers') నుంచి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. 2026–27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు(Kharif Marketing Season) కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్ఎస్పీ ప్రకారం ధాన్యానికి నాణ్యత ఆధారంగా క్వింటాల్‌కు ₹2,461 వరకు మద్దతు ధర లభించనుందన్నారు.పండించిన ధాన్యాన్ని దళారుల వద్ద తక్కువ ధరకు విక్రయించకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ప్రాధాన్యతగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, రైతులకు సమన్యాయం కల్పించాలని అధికారులను కోరారు.ప్రతి గింజకు న్యాయమైన ధర అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని,తూకం, నాణ్యత పరిశీలనలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు.
రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పూర్తిగా అందేలా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోడౌన్లు/మిల్లులకు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ఆదేశించారని,ప్రతి ఐకేపీ కేంద్రానికి బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2026–27 ఖరీఫ్ సీజన్లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని,వేలాది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు,ఉప సర్పంచ్ కొమురయ్య, ముస్తాబాద్ ఉప సర్పంచ్ విజయ్,మహేష్,భాను, నరేష్,ఐకేపీ సిబ్బంది,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.