‘మెట్’కు రెవెన్యూ అధికారులేరీ?

26-10-2026 | 05:25am
  1. లంచం కేసులో తహసీల్దార్, సర్వేయర్లను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
  2. రోజులు గడుస్తున్నా నియామకాలు ఏవీ?
  3. ఇంచార్జి భుజాలపై కొండంత భారం
  4. రైతుల ఆవేదన పట్టని ఉన్నతాధికారులు
  5. తహసీల్దార్, సర్వేయర్లను వెంటనే నియమించాలని స్థానికుల డిమాండ్

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రాజధాని హైదరాబాద్(Capital city Hyderabad) నగరాన్ని ఆనుకుని ఉన్న అబ్దుల్లాపూర్మెట్ మండలంలో రెవెన్యూ సేవలు(Revenue Services) తీవ్రంగా స్తంభించిపోయాయి. భూముల విలువ భారీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రతిరోజూ వందలాది రెవెన్యూ దరఖాస్తులు వస్తుంటాయి. అయితే, కీలకమైన తహసీల్దార్, మండల సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం అల్లాడిపోతున్నారు.

ఖాళీ అయిన పోస్టులు..

గత అక్టోబర్ 12న రూ.20 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో మండలంలో ఒక్కసారిగా సంచలనం రేగింది. అయితే, వారు పట్టుబడి పదుల రోజులు గడుస్తున్నప్పటికీ, ప్రభుత్వం కానీ, రెవెన్యూ ఉన్నతాధికారులు కానీ అక్కడ కొత్తగా పూర్తిస్థాయి తహసీల్దార్ను లేదా సర్వేయర్నునియమించకపోవడం గమనార్హం.

ఇంచార్జి పాలన.. కొండంత భారం..

ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి కార్యాలయ వ్యవహారాలు వెళ్లదీస్తున్నారు. అయితే, ఒక వైపు దైనందిన కార్యాలయ పరిపాలన, మరోవైపు ఉన్నతాధికారుల సమీక్షలు, కోర్టు కేసులు, ఇతర శాఖల సమన్వయం మరియు వివిధ రకాల అధికారిక విధులకే ఆయన సమయం సరిపోతోంది. దీనికితోడు తహసీల్దార్ డిజిటల్ సంతకం లభించకపోవడం, పూర్తిస్థాయి నిర్ణయాధికారాలు లేకపోవడంతో ప్రధాన భూ సమస్యల ఫైళ్లు కదలడం లేదు.

నలిగిపోతున్న రైతాంగం.. భూ వివాదాలు, సర్వేలకు జాప్యం

అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో భూమి రిజిస్ట్రేషన్లు, రికార్డుల రెక్టిఫికేషన్ (సవరణలు), విరాసత్ (వారసత్వ మార్పిడి), భూ కొలతలు (సర్వేలు), నిషేధిత భూముల జాబితా వంటి సమస్యలు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి.మరో పక్క సర్వేయర్ లేకపోవడంతో హద్దుల వివాదాలు తెగడం లేదు.అత్యవసర అవసరాల కోసం, పిల్లల చదువులు లేదా వివాహాల కోసం భూములుఅమ్ముకుందామన్నా....రెవెన్యూ రికార్డుల్లో సమస్యల వల్ల లావాదేవీలు నిలిచిపోయాయి.

చుట్టూ తిరుగుతున్న బాధితులు..

నిత్యం వివిధ గ్రామాల నుంచి కార్యాలయానికి వస్తున్న రైతులు, పనులు కాక నిరాశతో వెనుదిరుగుతున్నారు.వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగానికి కూడా దెబ్బహైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే ఈ మండలంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు, వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువే. పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో నాన్-అగ్రికల్చర్ లేఅవుట్లు, కన్వర్షన్లు, క్లియరెన్స్ సర్టిఫికేట్ల జారీ ఆలస్యమవుతోంది. దీనివల్ల స్థానిక ఆర్థిక లావాదేవీలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది.

అధికారులను నియమించాలి..

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, అబ్దుల్లాపూర్మెట్కు పూర్తిస్థాయి తహసీల్దార్తో పాటు మండల సర్వేయర్ను తక్షణమే నియమించాలని స్థానిక ప్రజలు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ సేవల వేగవంతానికి ప్రత్యేక దృష్టి సారించి రైతులను, బాధితులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు