చేవెళ్లలో లంచాల పర్వం

02-10-2026 | 05:10am
  1. అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం
  2. ఒకే నెలలో ఐదుగురు అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం
  3. సబ్-ట్రెజరీ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో యథేచ్ఛగా దందా
  4. నియోజకవర్గ ప్రతిష్టకు మాయని మచ్చగా మారిన అధికారుల తీరు

చేవెళ్ళ, అక్టోబర్ 1 (విజయక్రాంతి): చేవెళ్ల నియోజకవర్గం(Chevella Constituency)లో కొందరు ప్రభు త్వ అధికారుల అవినీతి అక్రమాలు సరిహద్దులు దాటుతున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే జలగల మాదిరిగా మారి సామాన్యుల సొమ్మును పీల్చి పిప్పి చేస్తున్నారు. నెలానెలా ప్రభుత్వం నుంచి భారీ జీతభత్యాలు అందుతున్నప్పటికీ, అక్రమ సంపాదనకు అలవాటు పడి లంచగొండులుగా మారుతున్నారు. వరుసగా ఏసీబీ దాడుల్లో కీలక అధికారులు రంగులరాట్నంలో చిక్కుకోవడం నియోజకవర్గంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.

వరుస ఏసీబీ దాడులు....

గత నెల 30న మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, చేవెళ్ల మున్సి పల్ టౌన్ ప్లానింగ్ ఇంచార్జ్ గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్లు మున్సిపాలిటీ పరిధిలోని ఒక ఇంటి నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.

సబ్-ట్రెజరీ కార్యాలయంలో ముగ్గురు అరెస్ట్

సెప్టెంబర్ 17న చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో సబ్-ట్రెజరీ అధికారి మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధ, పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ అధికారి వద్దె జంగయ్య ఒక రిటైర్డ్ ఉద్యోగి బిల్లు క్లియరెన్స్ కోసం రూ.1,00,000 లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి అరెస్ట్ చేశారు.విద్యుత్ శాఖ ఏడీఈ రాజేష్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో రూ. 17 లక్షల నగదుతో పాటు ప్రాపర్టీ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి, చేవెళ్ల టీపీఓ ఇంచార్జి మణిహారిక మంచిరేవులలోని ఒక ప్లాట్కు ఎల్ ఆర్ ఎస్ క్లియరెన్స్ ఇవ్వడానికి రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.ఏసీబీకి దొరికిన అధికారులే పదే పదే కీలకమైన ‘ఇంచార్జ్‘ బాధ్యతల్లో కొనసాగడం మరియు సెప్టెంబర్ నెలలోనే మున్సిపల్, సబ్-ట్రెజరీ శాఖలకు చెందిన ఐదుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

కలెక్టర్ అవినీతి అధికారులపై దృష్టి పెట్టాలి...

వరుస దాడులతో నియోజకవర్గ ప్రతిష్ట తీవ్రంగా దిగజారింది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగలేక, అధికారుల వేధింపులు తాళలేక ఏసీబీని ఆశ్రయిస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుపోయిందో స్పష్టమవుతోంది.

గతంలో పత్రికల్లో వచ్చిన అవినీతి కథనాలపై స్పందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినప్పటికీ, కిందిస్థాయి అధికారులలో ఎలాంటి మార్పు రావాడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ సంయుక్తంగా నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో వెంటనే ఒక సమగ్ర రివ్యూ మీటింగ్ నిర్వహించి, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం తో పాటు ప్రభుత్వ కార్యాల్లో ప్రజలకు పరిపాలన మరింత సులభతరం చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు