గిరిజన ఆదివాసీ హక్కులను కాపాడాలి
- తెలంగాణ గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గోపి నాయక్
ఎల్బీనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పట్ల వివక్షత చూపుతూ, అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకుండా ఆదివాసీ గిరిజనులను వారి భూముల నుంచి వెళ్లగొట్టే కుట్రలను వెనక్కి తీసుకోవాలని గిరిజనుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద తెలంగాణ గిరిజన సంఘం, ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్(Adivasi Adhikar Rashtriya Manch) ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం(Telangana Tribal Association) రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.గోపినాయక్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటి పరిష్కారంపై తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.
దేశవ్యాప్తంగా ఆదివాసీలు, గిరిజనులు తమ సమస్యలకు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government)పై పోరాటం నిర్వహిస్తామన్నారు. అదే విదంగా అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించాలని, గిరిజనులను వారి సాగుభూముల నుంచి తొలగించే చర్యలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, భూమి తదితర మౌలిక సమస్యలను పరిష్కరించడంతో పాటు గిరిజనుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ధర్నాలో రంగారెడ్డి జిల్లా నాయకులు ఈశ్వర్ నాయక్, నేనావాత్ పార్వతీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
