డీఎస్సీకి దిక్కులేదు!

11-10-2026 | 05:25am
  1. నిరుడు నోటిఫికేషన్ వేస్తారని భావించిన నిరుద్యోగులు
  2. 12 ఏండ్లలో వేసిన డీఎస్సీ నోటిఫికేషన్లు రెండే..

అక్టోబర్ 10 (విజయక్రాంతి): ‘తెలంగాణలో ఇదే చివరి డీఎస్సీ కాదు. త్వరలోనే ఐదారు వేల టీచర్ పోస్టులతో(DSC Teacher Recruitment) మరో డీఎస్సీ వేస్తాం’ అని 14 జూలై 2024న రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రకటించింది. అప్పుడు అభ్యర్థులంతా సంతోష పడ్డారు. 2025లో ప్రభుత్వం డీఎస్సీ వేస్తుందని భావించారు. కానీ నేటివరకు ఆ డీఎస్సీ హామీ అలానే మిగిలిపోయిం ది. ప్రభుత్వం దానిగురించి ఊసే ఎత్తడంలేదు.

పైగా ప్రభుత్వ పెద్దలను, ఉన్నతా ధికారులను నిరుద్యోగులు కలిసి డీఎస్సీ వేయాలని కోరుతున్నప్పుడు ‘మొన్ననేగా డీఎస్సీ (2024లో) వేసింది.. అప్పుడే మరో డీఎస్సీనా? సరేలే చూద్దాం. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తాం’ అని చెబుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి జాతీ య సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువగానే ఉం దని.. విద్యార్థులకు సరిపడా టీచర్లు ఉన్నారని అధికారులు చెప్తుండటం గమనార్హం.

ఇచ్చిన హామీ గాలికి..

త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని గొప్ప గా ప్రకటించిన ప్రభుత్వం, రెండేళ్లు గడుస్తున్నా దాని ఊసే ఎత్తకపోవడం నిరుద్యో గుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి పరాకాష్ట అనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ఇది లక్షల మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవడమేనని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో డీఎస్సీ కోసం దాదాపు 3.50 లక్షల మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఎదరుచూస్తున్నారు.

డీఎస్సీ నో టిఫికేషన్‌ల జారీలో గత, ప్రస్తుత ప్రభుత్వా లు చేస్తున్న తాత్సారంతో ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవాలనుకునే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. టెట్ నోటిఫికేషన్లను ఏడాదికి రెండేసి వేస్తున్నారు. కానీ డీఎస్సీ నోటి ఫికేషన్లు వేయకపోవడంతో చాలా మంది అభ్యర్థులు అర్హతను, ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తోంది. టీచర్ ఉద్యో గం చేయాలనుకునేవారి ఆశలు కల్లలవుతున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు.

గత 20 ఏళ్లలో అటు ఉమ్మడి రా ష్ట్రం, ఇటు ప్రత్యేక రాష్ట్రంలో కలిపి కేవలం ఐదు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఉద్యోగ పదవీ విదరమణ ఖాళీలను వెనువెంటనే భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. పైగా అర్హతను కూడా కోల్పోవాల్సి వస్తోంది. 

పుష్కర కాలంలో రెండే నోటిఫికేషన్లు!

2006 నుంచి ఇప్పటివరకు అంటే 20 ఏళ్లలో కేవలం ఐదు డీఎస్సీ నోటిఫికేషన్లు మాత్రమే వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మూ డు డీఎస్సీ నోటిఫికేషన్లు వేస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  2017, 2024లో రెండు డీఎస్సీ నోటిఫికేషన్లు వేశారు. 2017 లో 8,792 పోస్టులు, 2024లో 11,066 కలిపి 19,858 పోస్టులను భర్తీచేశారు. అదే ఏపీలో మూడు డీఎస్సీలు వేశారు. 2014, 2018, 2023లో వేశారు. మళ్లీ ఈనెల 15న వేసేందుకు అక్కడి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

అంతేకాకుండా ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయిం చింది. 2026, 2027, 2028, 2029 వరకు ఖాళీల జాబితాను ఏపీ ప్రభుత్వం రూపొందించింది. కానీ మనదగ్గర ఇంత వరకూ మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఊసేలేదు. కాం గ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గతేడాది ఫిబ్రవరిలోనే డీఎస్సీ నో టిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంది. నిరుద్యోగులు మాత్రం నోటిఫికేషన్ కోసం ఎదు రుచూస్తూ అర్హతను కోల్పోయే పరిస్థితి ఉంది.

వయస్సు సడలింపు ఇచ్చినప్పటికినీ సంవత్సరాల తరబడి చదవాలనే ఆసక్తి నో టిఫికేషన్ జాప్యం కారణంగా సన్నగిల్లుతోందని, ఖర్చులు  కూడా తడిసిమోపెడవుతు న్నాయని అభ్యర్థులు ఆవేదన వాపోతున్నా రు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌లు.. గ్రూప్1, గ్రూప్ 2..నోటిఫికేషన్లను వరుసగా వేస్తుంటే  ఇక్కడ తెలంగాణలో మాత్రం ప్రభుత్వాలు మారినా నిరుద్యోగులకి భరోసా ఇవ్వటం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

జాబ్ క్యాలెండర్ కూడా అటకెక్కింది. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని నమ్మించి గద్దెనెక్కిన ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇప్పటికీ అయినా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ప్రకటన చేసి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని అభ్యర్థు లు హెచ్చరిస్తున్నారు. 

20 వేల పోస్టులు భర్తీ చేయాలి

డీఎస్సీ కోసం దాదాపు మూడున్న ర లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూ స్తున్నారు. టెట్ నోటిఫికేషన్లు ఏడాదికి రెండు సార్లు వేస్తున్న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూడా ఏడాదికోసారి వేయాలి.  సుమారు 20 వేలకుపైగా ఖాళీ పోస్టులున్నాయి.

ఈ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే నోటిఫికేషన్లు వేసి చేతు లు దులుపుకుంటున్నది. కాంగ్రెస్ ప్ర భుత్వం వచ్చాక బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023లో 5 వేల పోస్టులతో వేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి 11 వేల పోస్టులతో 2024లో నోటిఫికేషన్ జారీ చేశా రు. 2024 నుంచి ఇప్పటి వరకు దా దాపు 12 వేల మంది వరకు రిటైరయ్యారు. అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. 

 దుర్గం హరీష్ 

మరిన్ని వార్తలు