కొనేవారే కరువు!
- కూకట్‌పల్లిలో ట్రక్‌పార్క్ భూముల వేలానికి స్పందన శూన్యం
- కోర్టు అడ్డంకులు తొలగినా ముందుకు రాని కొనుగోలుదారులు
- కోకాపేట నియోపోలీసు భూములకు కూడా దాఖలు కాని బిడ్లు
- వేలం రద్దు చేసిన హెచ్‌ఎండీఏ
- అధిక ధరలే కారణమని ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): కూకట్‌పల్లి ట్రక్ పార్క్(Kukatpally Truck Park) భూమి వేలానికి బిడ్లు దాఖలు కాలేదు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ భూమికి శుక్రవారం హెచ్‌ఎండీఏ ఈ వేలం నిర్వహించింది.సర్వేనంబర్లు 121/పి నుంచి 141 వరకు, సర్వే నంబర్లు 146, 147, 155, 157లో కలిపి మొత్తం 3.15 ఎకరాల భూమికి సంబంధించి ఈ- నిర్వహించేందుకు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ట్రక్ అసోసియేషన్, ఇతర ప్రైవేటు వ్యక్తులు కొందరు పిల్ వేయగా హైకోర్టు వాటిని కొట్టివేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం యథావిధిగా ఈ నిర్వహించారు. మెట్రో స్టేషన్, ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఈ భూమికి.. ఎకరం కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించారు. కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి వేలం నిర్వహించనున్నట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.
కోకాపేటలో నియోపోలీస్ భూములకు కూడా..
కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌లోని ప్లాట్ నంబరు 17లోని భూమి కథ మళ్లీ మొదటికి వచ్చింది. మొత్తం 4.59 ఎకరాల భూమికి హెచ్‌ఎండీఏ శుక్రవారం వేలం నిర్వహించగా స్పందన కరువైంది. కనీస ధర ఎకరాకు రూ.120 కోట్లుగా నిర్ధారించింది. ఒక్క బిడ్డు కూడా దాఖలు కాకపోవడంతో అధికారులు వేలాన్ని రద్దు చేశారు. సెప్టెంబర్‌లోనూ ఇదే భూమికి వేలం నిర్వహించగా రూ.120 కోట్లతో ఒకే బిడ్డు దాఖలైంది. దీంతో అప్పట్లోనూ వేలం రద్దు చేశారు. స్థిరాస్తి సంస్థల నుంచి పోటీ లేకపోవడంపై హెచ్‌ఎండీఏ సమీక్షిస్తోంది. బహుళ అవసరాల జోన్ కింద ఉన్న ఈ లేఅవుట్‌లో ఇప్పటికే 60 అంతస్తుల భారీ వాణిజ్య, నివాస, వ్యాపార భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి.
తొలిసారి వేలంలో ఇక్కడ ఎకరం రూ. వంద కోట్లు దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో మిగిలిన భూమికి భారీ ధర పలుకుతుందని అధికారులు భావించారు. ఇటీవల జరిగిన వేలం పాటలో సింగిల్ బిడ్ మాత్రమే దాఖలు కావడంతో హెచ్‌ఎండీఏ పునరాలోచనలో పడింది. ఎకరం కనీస ధర రూ.120 కోట్లు నిర్ణయించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ముందే భారీ మొత్తంలో కనీస ధర పెట్టడం.. దరావత్తు రూ.5 కోట్లు వసూలు చేయడం వల్ల చాలామంది వేలంలో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు.
ట్రక్ పార్క్ స్థలం వేలానికి తొలగిన అడ్డంకి!
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములు వేలానికి అడ్డంకులు తొలగిపోయాయి. ట్రక్ పార్కుకు చెందిన 3.15 ఎకరాల భూమిని వేలం నిలిపివేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ వ్యాజ్యాలను శుక్రవారం కొట్టివేసింది. దీంతో వేళానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఎమ్మెల్యే కృష్ణారావు ప్రకటించారు.