తెలంగాణకు సహకరించాలి

28-11-2026 | 05:35am
  1. రూ.25,096 కోట్ల విద్యుత్ డీపీఆర్‌లకు ఆమోదం తెలపాలి
  2. ఛార్జీల మినహాయింపును 2030 మార్చి వరకు పొడిగించాలి
  3. రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కోరారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పంపిణీ వ్యవస్థల ఆధునికీకరణకు సంబంధించి రూ.25,096 కోట్ల విలువైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ఈ ఏడాది మే 27న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించామని, పెండింగ్‌లో ఉన్న డీపీఆర్‌లకు 60 రోజుల్లో ఆమోదం తెలపడంతో పాటు 2028 మార్చి 31 వరకు పనుల అమలుకు పూర్తి గడువు కల్పించాలని కోరారు. టీజీజెన్కో చేపట్టనున్న కల్లూరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ త్వరితగతిన ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టెండర్లు చేపట్టిన 2,000 మెగావాట్ అవర్ల బ్యాటరీ విద్యుత్ నిల్వ ప్రాజెక్టులకు కూడా కేంద్ర ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

తెలంగాణకు 5,801 మెగావాట్ల నెట్‌వర్క్ యాక్సెస్‌లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ, 2025 అక్టోబర్‌లో రూ.195 కోట్లు, నవంబర్లో రూ.145 కోట్ల మేర ప్రసార ఛార్జీలు విధించారని తెలిపారు. చెల్లించిన బిల్లులను పునరాలోచించి అదనపు ఛార్జీలు విధించే విధానానికి స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారతదేశానికి 6,000 మెగావాట్ల విద్యుత్‌ను అందించే రాయ్‌గఢ్ హెచ్‌వీడీసీ విద్యుత్ ప్రసార వ్యవస్థకు పూర్తిస్థాయిలో జాతీయ హోదా కల్పించాలని కోరారు. తెలంగాణలో 23,480 ఎంవీఏ సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులకు తొలి విడతలోనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ఆమోదించిన విద్యుత్ వనరుల సమృద్ధి ప్రణాళిక మేరకు రాష్ట్రాలు సమకూర్చుకునే విద్యుత్ సామర్థ్యానికి 2030 మార్చి 31 వరకు ప్రసార ఛార్జీల మినహాయింపును పొడిగించాలని కోరారు.   

మరిన్ని వార్తలు