50% సీట్ల పెంపు

28-11-2026 | 05:30am
  1. లోక్‌సభలో 850కి చేరనున్న సీట్లు, అసెంబ్లీల్లోనూ 50 శాతం పెరుగుదల
  2. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు కేంద్రం ఆమోదం
  3. పార్లమెంట్ ఆమోదానికి 30 నుంచి ప్రత్యేక సమావేశాలు
  4. మూడింట రెండొంతుల మెజారిటీపై మోదీ సర్కారు ధీమా
  5. 2051 వరకూ సీట్లలో మార్పులు చేయకుండా లాక్
  6. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలకు చెక్ పెట్టే ప్లాన్
  7. వైసీపీ, ఎన్సీపీ మద్దతు.. డీఎంకే మద్దతుపై ఆశలు

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో 50 శాతం సీట్లు పెంచే నియోజకవర్గాల పునర్విభజన, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులకు కేంద్ర క్యాబినెట్(Cabinet) ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

డీలిమిటేషన్(Delimitation) బిల్లును పార్లమెంటు మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదిస్తే 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే పెంచిన స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 నియోజక వర్గాలను 850 స్థానాల వరకు (కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి) పెంచడం ఈ ప్రతిపాదనలో కీలక అంశం. అన్ని రాష్ట్రాలకూ 50 శాతం సీట్లు అదనంగా లభించేట్లు కొత్త ఫార్ము లాను ప్రతిపాదించింది. అంతేకాదు.. 2051 వరకూ సీట్లలో మార్పులు చేయకుండా ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. దీంతో జనాభా పెరుగుదలలో వైరుధ్యం కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ప్రాతినిధ్యం దక్కుతుందన్న విమర్శలకు ఈ ప్రతిపాదనతో చెక్ పెట్టినట్లు అయింది.

అయితే.. ఈ హామీ రాజకీయ ప్రకటనగానే ఉంటుందా.. బిల్లులో స్పష్టమైన రాజ్యాంగ నిబంధనగా ఉంటుందా.. అనేది స్పష్టం కాలేదు. కొత్తగా ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ, శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ మద్దతు ప్రకటించాయి. డీఎంకే మాత్రం లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం లభిస్తున్న 7.18 శాతం వాటాకు భంగం కలగకుంటేనే మద్దతిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన డీలిమిటేషన్ బిల్లు ను వెనక్కి తీసుకొని.. దాని స్థానంలో మార్పులతో కొత్త బిల్లును పెట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది.

మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ అనుసంధానం

డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ స్థానాలను పెంచి.. మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తే ప్రస్తుత ప్రజా ప్రతినిధుల స్థానాలపై ప్రభావాన్ని తగ్గించవచ్చన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడం రాజకీయ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పునకు దారితీయవచ్చు. ఎస్సీ, ఎస్టీ మహిళలకూ కోటా వర్తిస్తుంది. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం అమలును వేగవంతం చే యడమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది.

అయితే.. మహిళలకు ఏ నియో జక వర్గాలను కేటాయిస్తారు? రిజర్వేషన్ రొటేషన్ ఎలా ఉంటుంది? ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలతో దాని అనుసంధానం ఎలా ఉంటుంది? వంటి అంశాలపై తుది చట్టంలో స్పష్టత రావాల్సి ఉంది. 2003లో చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 15 ఏళ్ల పాటు మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో కొనసాగుతాయని ప్రతిపాదిత బిల్లు పేర్కొం టోంది. అయితే.. ఈ కాలపరిమితిని పొడిగించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. దీని కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయాల్సి ఉంటుంది. 

30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 30, డిసెంబర్ ఒకటో తేదీల్లో లోక్‌సభ, డిసెంబర్ 2, 3 తేదీల్లో రాజ్యసభ సమావేశం కానున్నాయి. ఈ బిల్లు ఆమో దం పొందాలంటే ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు అవసరం.

రాజ్యాంగంలోని సమాఖ్య అంశాలకు సంబంధించిన సవరణలకు కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా కావాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ అమలు ప్రాతిపదికను 2021 లేదా 2027 జనగణను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. సవరణ అమల్లోకి వచ్చే తేదీ నాటికి అందుబాటులో ఉన్న తాజా జనాభా గణాంకాలను ఉపయోగించాలని పేర్కొన్నది. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రక్రియ దేశ పార్లమెంటరీ వ్యవస్థ రూపురేఖలను ఎంతవరకు మారుస్తుందనేది పార్ల మెంటు సమావేశాల్లో జరిగే చర్చలో తేలనుంది. 

తెలుగు రాష్ట్రాలకు లాభమెంత?

డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం లభిస్తే రాష్ట్రాల శాసన సభల్లోనూ సీట్ల సంఖ్యను 50 శాతం పెరుగుతాయి. అయితే.. గరిష్ట పరిమితిని 650గా నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం కూడా భారీగా పెరిగే చాన్స్ ఉంది. 17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణ ప్రాతినిధ్యం 50 శాతం పెంపుదల ప్రకారం 25 లేదా 26 స్థానాలకు చేరే అవకాశం ఉంది. 25 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌కు 37 నుంచి 38 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. తుది నియోజక వర్గాల సంఖ్య, సీట్ల కేటాయింపు, రౌండింగ్ విధానంపై స్పష్టత రావాల్సి ఉంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం పెరిగితే తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతిని ధులు తమ గళాన్ని వినిపించి ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా, నిధుల పంపిణీ, విభజన హామీలు పొందడానికి వీలుంటుంది. అసెంబ్లీ స్థానాలు తెలంగాణలో 119 నుంచి 178 లేదా 179కి, ఏపీలో 262 నుంచి 263కి పెరిగే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు