బొగ్గు మంటలు
విదేశీ కోల్మాల్
- రూ.3 వేల కోట్ల భారీ స్కాంకు కుట్ర
- భోత్రా లాజిస్టిక్స్ కంపెనీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందం
- సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో కావాలని బొగ్గు, విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి, ఇప్పుడు అదే సంక్షోభాన్ని కుంటిసాకుగా చూపి విదేశీ బొగ్గు దిగుమతి పేరుతో సుమా రు రూ.3,000 కోట్ల భారీ బొగ్గు కుంభకోణానికి తెరలేపుతున్నారని, ఇది అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మండిపడ్డారు. ఇటు సింగరేణికి ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా.. అటు దేశంలో బొగ్గు వనరులు అందుబాటులో ఉన్నా, దేశీయ సరఫరాను పెంచే చర్యలు తీసుకోకుండా విదేశీ బొగ్గు వైపే మొగ్గు చూపడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
విద్యుత్ సంక్షోభాన్ని ముందస్తు ప్రణాళికతో ఎదుర్కోవాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు కరెంట్ కోతలపై ప్రజలు, రైతుల ఆందోళనను బూచీగా చూపించి దిగుమతులకు అనుకూలంగా మలుచుకోవడం వెనక భారీ స్కాం దాగి ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో భోత్రా లాజిస్టిక్స్ అనే కంపెనీ పాత్ర అత్యంత అనుమానాస్పదంగా కనిపిస్తోందని, ఈ కంపెనీకి సింగరేణిలో కాంట్రాక్టులు అప్పగించడంలో అనుసరించిన ప్రమాణాలేమిటి? ఏ అర్హతల ఆధారంగా ఈ సంస్థను ఎంపిక చేశారు? టెండర్ల ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగింది? ఈ ప్రశ్నలకు సీఎంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిపైనే ఉందని నిలదీశారు.
భోత్రా లాజిస్టిక్స్ కంపెనీతో సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, టెండర్ల వివరాలు, చెల్లింపులన్నింటినీ బహి ర్గతం చేయాలని, ఈ కంపెనీ ఎంపిక వెనుక ఉన్న కారణాలు, దానికి ఇప్పటివరకు అప్పగించిన కాం ట్రాక్టులు, చెల్లించిన నిధులపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, విదేశీ బొగ్గు దిగుమతుల వ్యవహారంలో ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తు న్నారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంలో బొత్రా లాజిస్టిక్స్ పాత్ర ఏమిటి?, టన్నుకు రూ.1,500 కమిషన్ చొప్పున ఏకంగా రూ.3,000 కోట్ల దోపిడీకి మీరు చీకటి ఒప్పందాలు చేసుకున్నట్టు అర్థమైపోయిందని, అందుకే ఇన్నాళ్లు కనీసం సమీక్షలు సమావేశాలు నిర్వహించకుండా హడావిడిగా విదేశీబొగ్గు స్కాంకు తెరలేపారని ఆరోపించారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు కేటీఆర్ బహరంగ లేఖ రాశారు.
వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగే నేపథ్యంలో గనుల అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాలు, బొగ్గు నిల్వలు, రవాణా, దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ ఈ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించకుండా, సంక్షోభం తీవ్రమయ్యాక సమీ క్షలు నిర్వహించి నెపం అధికారులపై నెట్టి బాధ్యత నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
వివరాలన్నీ ప్రజల ముందుంచాలి
2023 సుమారు 70.02 మిలియన్ ట న్నుల ఉత్పత్తి నమోదుకాగా, 2025 ఉత్ప త్తి సుమారు 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని తెలిపారు. ఈ తగ్గుదలకు కారణాలేమిటి? గనుల అభివృద్ధికి మీ ప్రభుత్వం ఏం చేసింది? సింగరేణి కార్మికుల సామర్థ్యాన్ని ఎందుకు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు?, ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోకుండా దేశీయ బొగ్గు కొరత ఏర్పడే పరిస్థితిని ఎందుకు నివారించలేకపోయా రు? అని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యానికి ప్రజాధనం వృధాచేసి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎందుకు సృష్టించారు ? దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రావాల్సిన బకాయిల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, సుమారు రూ.60,000 కోట్ల బకాయిలున్నాయన్న లెక్కలపై సంస్థల వారీగా పూర్తి వివ రాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
గనుల అభివృద్ధికి, ఉత్పత్తి పెంపునకు అవసరమైన నిధులు అందించకుండా సింగరేణి సామర్థ్యాన్ని దెబ్బతీసి, ఆ తర్వాత దేశీయ బొగ్గు సరిపోవడం లేదని చెప్పడం మీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కాదా? అని ప్రశ్నించారు. బొగ్గు వనరులను వినియోగించుకోవడంలోనూ మీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. ఒడిశాలోని నైని బ్లాక్‌లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో అక్కడి నుంచి సరఫరాను పెంచేందుకు ఏ చర్యలు తీసుకున్నారు? మహానది ప్రాంతం నుంచి బొగ్గు సరఫరా చేసుకునే అవకాశాలు ఉన్నా ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు బొగ్గు సరఫరా విషయంలోనూ మీ అర్థపర్థం లేని వాదనల్లోని డొల్లతనం ఆధారాలతో సహా బయటపడిందని, 2018 ఫిబ్రవరి 15న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ జారీ చేసిన 23014/1/2018- సీఎల్డీ ప్రకారం, సింగరేణి గనుల నుంచి యాదాద్రికి సంవత్సరానికి 14 మిలియన్ టన్నుల జీ గ్రేడ్ బొగ్గు సరఫరాకు లింకేజీ కేటాయింపు జరిగిందని, 2022 ఏప్రిల్ 27న సరఫరాకు సంబంధించి ఒప్పందం కూడా కుదిరిందని, మరి ఇప్పుడు బొగ్గు కొరత, నాణ్యత సమస్యల పేరుతో విదేశీ బొగ్గు దిగుమతుల అవసరాన్ని ఎందుకు ముందుకు తెస్తున్నా రు? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధం..
విదేశీ బొగ్గు దిగుమతుల వ్యవహారంలో టన్ను కు ఏకంగా రూ.1,500 కమీషన్‌ను దండుకునేందుకు మీరు స్కెచ్ వేశారనే అంశం తెరపైకి వస్తోం దని, ఈ లెక్కన సుమారు రూ.3,000 కోట్ల కుంభకోణానికి రంగం సిద్ధం చేసినట్టు స్పష్టమవుతోం దని ఆరోపించారు. అసలు బొగ్గు దిగుమతి పరిమాణం ఎంత?, ఒక్కో టన్నుకు అసలు కొనుగోలు ధర ఎంత? రవాణా, ఇతర ఖర్చులు ఎంత? మధ్యవర్తులకు ఎలాంటి చెల్లింపులు ప్రతిపాదించారు? ఈ లెక్కలకు సంబంధించిన పత్రాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
దిగుమతులు ఇంకా ప్రారంభం కాని దశలోనే ఈ ప్రతిపాదనల వెనుక ఉన్న నిర్ణయాలు, ఖర్చులు, సరఫరాదారుల ఎంపికపై పూర్తి వివరాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మీపై ఉందని స్పష్టం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గు, యాష్ హ్యాండ్లింగ్ వంటి పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన దుర్మార్గంపై మీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జెన్కోకు థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, సుమారు 7,500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్వహణ అనుభవం ఉన్నప్పుడు, ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యాన్ని వినియోగించకుండా ప్రైవేటు సంస్థలకు పనులు అప్పగించాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు. టెండర్ల విలువ, ఒప్పంద నిబంధనలు, నిర్వ హణ ఖర్చులు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పనులు నిర్వహించే అవకాశాలపై చేసిన అధ్యయనాలను బహిర్గతం చేయాలని నిలదీశారు. సింగ రేణి, విద్యుత్ సంస్థల సామర్థ్యాన్ని బలహీనపరిచి ఇలా ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించి, విదేశీ బొగ్గు దిగుమతికి వెంపర్లాడే విధానాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
‘సింగరేణి ఉత్పత్తి తగ్గుతోంది.. బకాయిలు పేరుకుపోతున్నాయి.. దేశీయ బొగ్గు దిగుమతిపై స్పష్టత, ప్రణాళికా లేదు.. యాదాద్రికి కేటాయించిన బొగ్గు సరఫరా పరిస్థితిపై సమాధానాలు లేవు.. ఇదే సమయంలో విదేశీ బొగ్గు దిగుమతుల ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారని, ఇది కుట్ర కాకుంటే ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నింటికీ మీ ప్ర భుత్వం సమాధానం చెప్పాలని, సంక్షోభాన్ని ముం దుగానే నివారించాల్సిన మీరు, సంక్షోభం సృష్టించి, తర్వాత దిగుమతుల అవసరాన్ని ఎందుకు కావాలని ముందుకు తెస్తున్నారు? అని నిలదీశారు. కరెంట్ కోతలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగినప్పుడు అధికారులపై నెట్టి తప్పించుకోవాలని చూ డటం హేయమైన చర్య అని విమర్శించారు.
కమీషన్లు కట్!
- అందుకే కడుపుమంట
- సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే ఉండదు
- ఆ సంస్థను కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
- అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీశ్ డైవర్షన్ పాలిటిక్స్
- కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్‌బాబు మండిపాటు
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): సింగరేణి నుంచి కమీషన్లు ఆగాయని కొందరు కడుపుమంటతో ఆరోపణలు చేస్తున్నా రని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) మండిపడ్డారు. ‘తెలంగాణ ప్రజల గుండె కాయ. దానిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదు. కానీ, గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి మోదీ కాళ్ళ మీద పడిన చరిత్ర మీది కాదా? అప్పుడు మౌనంగా ఉండి.. బీజేపీకి పరోక్షంగా సహకరించింది మీరే కదా? బీజేపీతో రహస్య ఒప్పందాలు ఎవరికి ఉన్నాయో తెలంగాణ సమాజం అంతా గమనిస్తూనే ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. సింగరేణిని గతంలో కాపాడాం. ఇప్పుడు కాపాడుతున్నం.. భవిష్యత్తులోనూ కాపాడబోయేది మేమే’ అని శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.
టెండర్లలో పారదర్శకత తెచ్చి, దోపిడీకి అడ్డుకట్ట వేస్తుంటే బీఆర్ ఎస్ పదేళ్ల పాపాలు ఎక్కడ బయటపడుతాయోనన్న భయంలో కేటీఆర్, హరీశ్‌రావు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. గురువారం మంత్రి శ్రీధర్‌బాబు సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో ప్రస్తుతం తొమ్మిది గనుల నుంచి జీ-9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి అవుతోందని, గత పదేళ్లలో ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏటా సగటున సుమారు 4 మిలియన్ టన్నుల జీ-9 బొగ్గు సరఫరా అయిందని చెప్పారు.
‘తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి 25 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు సరఫరా చేసింది. అందులో జీ-9 గ్రేడ్ బొగ్గు 1.20 మిలియన్ టన్నులు (12 లక్షల టన్నులు) మాత్రమే. దానిలోనూ 0.52 మిలియన్ టన్ను లు తెలంగాణ జెన్కో విద్యుత్ కేంద్రాలకే సరఫరా అయింది ’ అని వివరించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఏటా 14 మిలియన్ టన్నుల జీ-9 బొగ్గు సరఫరా చేసేలా ఇంధన సరఫరా ఒప్పందం మీ హయాంలో జరిగిందే. సింగరేణి భవిష్యత్తులో చేపట్టే కొత్త గనుల నుంచి పెరిగే ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకొని ఆ ఒప్పందం జరిగింది.
మరి ఆ కొత్త గనులు ఎందుకు రాలేదు..?. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనకపోవడంతో కీలకమైన కోయగూడెం- 3, సత్తుపల్లి- 3 బ్లాకులు సంస్థకు దక్కలేదు. ఫలితంగా ఏటా దాదాపు 10 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశాన్ని సింగరేణి కోల్పోయింది. దాదాపు 14 గనులు మూతపడటంతో ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూ పింది. దీనివల్ల 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సింగరేణి కోల్పోయింది వాస్తవం కాదా?’ అని శ్రీధర్‌బాబు నిలదీశారు.
నైనీ వైపు కన్నెత్తి చూడలేదు..
బీఆర్ఎస్ హయాంలో నైనీ వైపు కన్నెత్తి కూడా చూడలేదని, తమ ప్రభు త్వం వచ్చాక రెండేళ్లలోనే నైనీ బొగ్గు గనికి అనుమతులు సాధించి ఉత్పత్తి ప్రారంభించామని మంత్రి తెలిపారు. 2013లో యూపీఏ ప్రభుత్వం మంజూ రు చేసిన తాడిచెర్ల బ్లాక్-2కు మైనింగ్ అనుమతులు తెచ్చామని, వేలం ద్వారా మణుగూరు పీకే ఓసీ-2 డిప్పుడ్ బ్లాక్‌ను సింగరేణికి దక్కించామని చెప్పారు. ‘వీటితో రానున్న రోజుల్లో సింగరేణి ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
137 ఏళ్ల సుదీర్ఘ మైనింగ్ అనుభవం ఉన్న సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, లోడింగ్ నుంచి రవాణా, తూకం, తుది పంపిణీ వరకు ప్రతి దశను పర్యవేక్షించే సాంకేతికత ఆధారిత, బహుళ అంచెల వ్యవస్థ అమల్లో ఉంది. ఎస్ఏపీ /ఈఆర్పీ అనుసంధానం, జీపీఎస్/జీఆర్పీఎస్ ద్వారా వాహనాల ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, ఎలక్ట్రానిక్ తూకం, ఆకస్మిక తనిఖీలు, బూమ్ బారియర్లు, బొగ్గు నిల్వల క్రమానుగత పరిశీలన, బొగ్గు చోరీ నిరోధక బృందాలు, నిరంతరం నివారణాత్మక విజిలెన్స్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
బొగ్గు మాయయ్యే పరిస్థితి ఉండదు..
ప్రతి టన్నుకూ లెక్క ఉన్న ఈ వ్యవస్థలో బొగ్గు మాయమయ్యే అవకాశమే లేదని, ఆధారాలు ఉంటే బయటపెట్లాని లేకుంటే సింగరేణి కార్మికుల, అధికారుల నిజాయితీపై బురద చల్లడం మానుకోవాని మంత్రి హితవు పలికారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను సింగరేణి సంస్థ ప్రయోజనం కోసం మాత్రమే ప్రవేశపెట్టామని ఇది ఏ ఒక్కరి ప్రయోజనం కోసం ఉద్దేశించింది కాదన్నారు. కాంట్రాక్టు చేపట్టేవారికి తాము చేయబోయే పనిపై ముందే పూర్తి అవగాహన ఉండాలని టెండర్ దక్కిన తర్వాత ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు జరగాలనే ఈ నిబంధన ఉద్దేశమన్నారు.
గతంలో ఓవర్ బర్డెన్ తొలగింపు టెండ ర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు అక్కడి భౌగోళిక పరిస్థితి, స్థానిక సాంఘిక అంశా లు, మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించకుండానే టెండర్లు వేసేవారు. టెండర్ దక్కి పని మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులకు ఇమడలేక పనులు ఆపేయడం, మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో సింగరేణికి నష్టం జరిగిందన్నారు. అందుకే ఈ నిబంధన ఆరోగ్యకరమైన పోటీకి, సమర్థంగా పనిచేయ గలిగే వారికి అవకాశం కల్పించినట్లు చెప్పారు.
ఇప్పుడెలా తప్పవుతుంది..
కాంట్రాక్టుకు ముందు సైట్ విజిట్ అనేది సింగరేణికే ప్రత్యేకం కాదని, జీఎండీసీ-గుజరాత్, జీఐపీసీఎల్, ఎన్ఎండీసీ, కొన్ని సోలార్ ప్రాజెక్టులు, ఈపీసీ కాంట్రాక్టుల్లోనూ దీన్ని అమలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐ సలహా మేరకు 2018, 2021, 2023లో సీహెచ్పీల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలోనూ సైట్ విజిట్ ను పొందుపరిచారని, కాంట్రాక్టు దక్కించుకున్నవారు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఓవర్ బర్డెన్ తొలగింపును సజావుగా కొనసాగిస్తున్నారని తెలిపారు.
గతంలో నిబంధన సరైనదయినప్పుడు .. ఇప్పుడు తప్పెలా అవుతుంది..? అప్పుడు నోరు మెదపని వారు ఇప్పుడు రాజకీయం చేయడమేంటీ..? అని మంత్రి మండిపడ్డారు. సింగరేణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ అని. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందన్నారు. సంస్థను మరింత బలోపేతం చేసి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రవేటీకరణవైపు నెట్టింది గత పాలకులే..
సింగరేణిని ప్రైవేటీకరణ వైపు నెట్టింది గత బీఆర్ఎస్ పాలకులేనని, బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణిని పాల్గొననివ్వకుండా, సంస్థకు కొత్త బ్లాకులు దక్కకుండా చేసి, తమ సన్నిహితులకు బ్లాకులు దక్కేలా చేసుకున్నారని మంత్రి తెలి పారు. ప్రజా ప్రభుత్వం ఒకే లక్ష్యంతో పనిచేస్తోంది. సింగరేణికి కొత్త బొగ్గు గనులను సాధిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని గనులను సాధించేందుకు కృషి చేస్తామని బొగ్గు ఉత్పత్తితో పాటు కీలక ఖనిజాలు, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లో సింగరేణి విస్తరించేలా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. గతంలో గనులు పోగొట్టిన వారే ఇప్పుడు ప్రైవేటీకరణ గురించి మాట్లాడం విచిత్రంగా ఉందన్నారు.
సింగరేణిని ఏటీఎంలా వాడుకున్నారు
గత పదేళ్లు సింగరేణి ఏటీఎంలా వాడుకుని నాశనం చేశారని, ఇప్పుడు పారదర్శకత వస్తుంటే అది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో టెండర్లలో జరిగిన దోపిడీ, కమీషన్ల సంస్కృతికి తాము అడ్డుకట్ల వేశామని, పారదర్శకత కోసం, టెండర్లను క్రమబద్ధీకరించడం వల్ల కొన్ని శక్తులకు కమీషన్లు ఆగిపోవడంతో ఇప్పుడు కడుపు మండుతోందన్నారు.
అక్రమాలు జరిగాయని మాట్లాడే కేటీఆర్, ఆ పార్టీ నాయకుల వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలి, ఊహాజనిత ఆరోపణలతో రాజకీయం చేయడం తగదన్నారు. విద్యుత్ సంస్థలకు బకాయిలు పెట్టిన తీరును కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్, ఆ పార్టీ నాయకులు మాపై బురదజల్లుతున్నారని, తాము వచ్చాక సింగరేణిని కాపాడి, ఆర్థిక క్రమశిక్షణలోకి తీసుకొస్తున్నామన్నారు. ‘కేసీఆర్ పాలనలో సింగరేణికి రావాల్సిన బకాయిలను ఎగ్గొట్టి, సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టింది మీరు కాదా.. విద్యుత్ సంస్థల పేరుతో రూ.వేల కోట్ల బకాయిలు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా? మ ర్చిపోయారా?’ అని మంత్రి నిలదీశారు.
మీ పాలనలో జరగని అవినీతి ఉందా?
పదేళ్ల మీ కుటుంబ పాలనలో జరగని అవినీతి ఉందా? కాళేశ్వ రం నుంచి మిషన్ భగీరథ వరకు రూ.లక్ష కోట్ల కుంభకోణాలకు పాల్పడిన మీ నోటి వెంట ’అవినీతి’ అనే మాట రావడం దయ్యాలు వే దాలు వల్లించినట్టుగా ఉంది’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులు, నాసిరకం ప్లానింగ్ వల్ల సంస్థ ఇబ్బంది పడింది నిజం కా దా? లాభాల వాటా గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు. మీ హయాంలో కార్మికులను ఏవిధంగా మోసం చేశారో అందరికీ తెలుసు. మాకు కార్మికుల సం క్షేమమే ముఖ్యం.
వారికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తాం. ఇందులో మా చిత్తశుద్ధిని శంకించే అర్హత మీకు లేదు. మేము వచ్చాక గనుల భద్రతకు, పర్యావరణ సమత్యులతకు ప్రాధాన్యం ఇస్తూ ఉత్ప త్తిని గాడిన పెడుతున్నాం. మీ లాగా కాంట్రాక్టర్ల కోసం కమీషన్ల కోసం గనుల ను గాలికి వదలలేదు’ అని పేర్కొన్నారు. యాదాద్రి ప్లాంటు ను కమీషన్ల కోసం అతుకుల బొం తలా నిర్మించి మూలన పడేలా చే శారని విమర్శించారు. లోపాలను సరిదిద్దుతుంటే విమర్శలు చేస్తా రా? బొగ్గు ఉత్పత్తిని పెంచి.. విద్యుత్ కొరత లేకుండా ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.