ఏసీబీ వలలో ముగ్గురు ఘనులు!
- రూ.2.50 లక్షలు తీసుకుంటూ చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్
- రూ.8 వేలతో దొరికిన వేములవాడ రూరల్ తహసీల్దార్
- హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో రూ.1.20 లక్షలు తీసుకుంటూ దొరికిన విద్యుత్ శాఖ ఏఈ
హైదరాబాద్ సిటీబ్యూరో/మేడ్చల్/వేములవాడ రూరల్ అక్టోబర్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వ అధికారులు(Government Officials) లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. కటకటాలపాలవుతూ సమాజంలో చిన్నచూపుకు గురవుతున్నా అధికారుల్లో మాత్రం మార్పు రావడంలేదు. కొందరు అధికారులు అక్రమ సం పాదనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నట్టు దీనిని బట్టి అర్థమవుతున్నది. గురువారం 22ఏ లోనుంచి భూమిని తొలగించేందుకు రూ.2.50 లక్షలు తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీకి చిక్కగా, హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో కొత్త విద్యుత్ మీటర్లు మంజూరు చేసేందుకు ఏఈ రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరకగా, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.8 వేలు తీసుకుంటూ వేములవాడ రూరల్ తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డారు.
కీసరలో డిప్యూటీ తహసీల్దార్
మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన పన్నాల బుచ్చిరెడ్డి భార్య సుశీల మృతి చెందడంతో ఆమె పేరుపై 183, 184 సర్వే నెంబర్లలో ఉన్న మూడు ఎకరాల భూమి తన పేరు మీద మ్యూటేషన్ చేయాలని కుమారుడు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించారు. ఆ భూమి నిషేధిత జాబితా 22ఏలో ఉందని, తొలగించాలంటే తహసీల్దార్‌తోపాటు ఆర్డీవో కార్యాలయంలో కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు డిప్యూటీ తహసీల్దార్ రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు.
బాధితుడు రూ.2.50 లక్షలకు ఒప్పందం చేసుకొని ఏసీబీని ఆశ్రయించారు. అధికారుల సూచనమేరకు బాధితుడు డబ్బులను మొదట వీఆర్ఏ విజయ్‌కుమార్‌కు అందజేశారు. వీఆర్ఏ ఆ డబ్బులను ప్రైవేట్ ఉద్యోగి అయిన బాలకృష్ణకు అందజేశాడు. బాలకృష్ణ ఆ సొమ్మును తహసీల్దార్ చాంబర్‌లోని బ్యాగులో పెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్సీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరుకుతున్నప్పటికీ అధికారుల తీరు మారడం లేదు. కీసర మండలంలో నెల రోజుల్లో ఐదుగురు ఏసీబీకి చిక్కడం గమనార్హం. గత నెల 17న రేషన్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి సీఐ, ఎస్సై రూ.5 లక్షలు తీసుకుంటూ దొరికారు. తాజాగా ఇద్దరు అధికారులతోపాటు ఒక ప్రైవేట్ ఉద్యోగి దొరికాడు.
పాతబస్తీలో ఏసీబీ దాడులు
హైదరాబాద్ సంతోష్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధి మాదన్నపేట సెక్షన్లో రాకేష్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఆరు కొత్త విద్యుత్ మీటర్ల మ ంజూరు కోసం ఓ వ్యక్తి సంప్రదించగా, పని పూర్తి చేసేందుకు ఏఈ రాకేష్ రూ.1.20 లక్ష ల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనమేరకు మాదన్నపేట సెక్షన్ పరిధిలో బాధితుడు ఏఈకి డబ్బులు ఇవ్వగా, అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ రాకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి కార్యాలయం, నివాసాల్లో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.
వేములవాడలో చిక్కిన తహసీల్దార్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఓ బాధితుడు తన మేనత్తకు చెందిన వ్యవసాయ భూమిని తన తండ్రి పేరిట గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలని తహసీల్దార్‌ను ఆశ్రయించారు. అందుకు తహసీల్దార్ డబ్బులు డిమాండ్‌చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. తహసీల్దార్ ఎండీ అబూబకర్ సూచనమేరకు బాధిడుతు భూ భారతి ఆపరేటర్ అనిల్‌కుమార్‌కు రూ.8 వేలు ఇవ్వగా అధికారులు ఇద్దరినీ పట్టుకున్నారు.