లంచాల బందీగా రేటువెన్యూ..!
- రూ. 85 లక్షల బిగ్ డీల్..
- అబ్దుల్లాపూర్‌మెట్ ఆఫీస్‌పై ఏసీబీ ప్రత్యేక ఫోకస్
- తీగ లాగితే కదులుతున్న అక్రమాల డొంక
- మాజీ తహసీల్దార్ల పైన ఫిర్యాదుల వెల్లువ
- అర్ధరాత్రి వరకు తనిఖీలు
- రూ. 40 కోట్ల బినామీ ఆస్తులపై ఏసీబీ కన్ను
రంగారెడ్డి బ్యూరో/అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల భూ సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే లంచాల బాట పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? రక్షణగా నిలవాల్సిన వ్యవస్థే భక్షణగా మారితే ఇక ప్రజలు న్యాయం కోసం ఎవరి తలుపు తట్టాలి? రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్(Abdullapurmet) తహసీల్దార్ కార్యాలయంలో వెలుగు చూసిన లంచాల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏకంగా రూ. 85 లక్షల బిగ్ డీల్ కుదుర్చుకొని, విడతల వారీగా లంచం పిండుకుంటున్న తహసీల్దార్ బి. సుదర్శన్‌రెడ్డి(Tahsildar B. Sudarshan Reddy), మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులును ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన అనంతరం ఏసీబీ బృందాలు రికార్డులను జల్లెడ పడుతుండగా, ఒక్కొక్కటిగా దిగ్భ్రాంతికర అవినీతి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
రూ. 85 లక్షల బిగ్ డీల్..
మండల పరిధిలోని పసుమాముల సర్వే నంబర్ 137లో ఉన్న 10 ఎకరాల విలువైన భూమికి సంబంధించి సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు భారీ రేటు ఫిక్స్ చేశారు. మొత్తం రూ. 85 లక్షలు డిమాండ్ చేయగా, ఇప్పటికే విడతల వారీగా రూ. 35 లక్షలు ముట్టినట్లు సమాచారం.
సదరు భూమి గతంలో నిషేధిత జాబితాలో ఉండటంతో, దానిని తొలగించడానికి (సెక్షన్ 22-A డిలేషన్ ) తొలుత రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ. 25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆ మొత్తాన్ని దండుకున్నారు. అదే భూమిని వ్యవసాయేతర వినియోగానికి (నాలా) మార్చే అనుమతుల కోసం మరో రూ. 10 లక్షలు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రూ. 50 లక్షల డిమాండ్...
22-ఏ తొలగింపు, నాలా కన్వర్షన్ పూర్తయిన తర్వాత, హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం లే అవుట్‌కు సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ లే అవుట్ సర్వే రిపోర్ట్ జారీ కోసం అధికారులు ఏకంగా మరో రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని వేడుకోవడంతో రూ. 30 లక్షలకు బేరం కుదిరింది. మొదటి విడతగా రూ. 20 లక్షల లంచం డబ్బులను కారులో స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో దాడి చేశారు. తహసీల్దార్ ఆదేశాలతో డబ్బులు తీసుకున్న సర్వేయర్ శ్రీనివాసులు, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డిలను ఆధారాలతో సహా ఏసీబీ అరెస్ట్ చేశారు.
తీగ లాగితే కదులుతున్న డొంక..
ఏసీబీ దాడితో వ్యవహారం ముగియలేదు. మంగళ, బుధవారాల్లో తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు విజిలెన్స్, మైనింగ్, ఇరిగేషన్, ఏసీబీ అధికారులు సంయుక్తంగా రికార్డులను పరిశీలించారు. విచారణలో సుదర్శన్‌రెడ్డికి కందుకూరులో 10 ఎకరాల భూమితో పాటు దాదాపు రూ. 40 కోట్లకు పైగా అక్రమాస్తులు, బినామీల పేరిట స్థలాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. సర్వేయర్ శ్రీనివాసులు పేరిట నల్గొండ జిల్లాలో అనేక ప్లాట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఆఫీసు లోపల కాకుండా బయట నిలిపిన వ్యక్తిగత కార్లలోనే సుదర్శన్‌రెడ్డి లంచాల బేరాలు పూర్తిచేసి డబ్బులు తీసుకునే శైలి ఏసీబీని సైతం విస్తుపోయేలా చేసింది.
మాజీ తహసీల్దార్లపై ఫిర్యాదుల వెల్లువ??
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందన్న ఆరోపణలు నిన్నమొన్నటివి కావు. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన పలువురు అధికారులు కూడా వివాదాస్పద సర్వే నంబర్ల పేరు చెప్పి భూములను 22-ఏ (నిషేధిత) జాబితాలోకి నెట్టడం, ఆ తర్వాత వాటిని తొలగించేందుకు ఎకరాకు రూ. 10 నుంచి 15 లక్షలు వసూలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ప్రస్తుత తహసీల్దార్ చిక్కడంతో, గతంలో పనిచేసిన మాజీ అధికారుల హయాంలో జరిగిన నిషేధిత జాబితా తొలగింపులు, నాలా కన్వర్షన్లు, జాయింట్ సర్వే రిపోర్టుల ఫైళ్లపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని బాధితులు ఏసీబీకి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు.
భూ దందాల అడ్డాగా ‘అబ్దుల్లాపూర్‌మెట్ ’..
సిటీ శివారుప్రాంతం ఆనుకుని ఉండటంతో అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్పేట్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఎకరం భూమి విలువ కోట్లలో ఉండటంతో ఇక్కడ రెవెన్యూ అధికారుల అవినీతి, క్రయవిక్రయాల సెటిల్మెంట్లు శృతిమించుతున్నాయి. గతంలో ఇదే అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో భూ వివాదం, అధికారుల వేధింపుల తట్టుకోలేక గతంలో పనిచేసిన తహసీల్దార్ విజయారెడ్డిపై ఆమె కార్యాలయంలోనే దారుణంగా పెట్రోల్ పోసి తగలేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
అంతటి దారుణ సంఘటనలు జరిగినా, ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల ప్రవర్తనలో, అవినీతి దాహంలో మార్పు రాకపోవడం గమనార్హం. ఏసీబీ దాడితోనైనా వ్యవస్థలో పూర్తిస్థాయి మార్పు వస్తుందా? ఏసీబీ కేసు నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో గత కొన్నేళ్లుగా జరిగిన భూ సంబంధిత దరఖాస్తులు, 22-ఏ జాబితా తొలగింపులు, నాలా కన్వర్షన్లు, లే అవుట్ సర్వే నివేదికల జారీ ప్రక్రియలపై సమగ్ర విచారణ జరగాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల స్థిర, చరాస్తులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అక్రమ రికార్డులను పరిశీలించి నిజానిజాలు వెలికితీసి బాధ్యులైన అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నమ్మకం నిలబడేనా?
ప్రజలకు సేవ చేయాల్సిన వ్యవస్థలో అక్రమ వసూళ్లకు తావుంటే ప్రభుత్వంపై ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. ఏసీబీ చర్యలు ఒక్క కేసుకే పరిమితం కాకుండా, గతంలో పనిచేసిన అధికారుల వ్యవహారాలన్నింటిపైనా నిష్పాక్షిక విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.