తెలంగాణ హైకోర్టు నిర్మాణంలో నాణ్యత, వ్యయంపై ఎవరిది పూచీ?
- అనేక లోటుపాట్లను ఎత్తిచూపిన కన్సల్టెన్సీ సంస్థ
- కన్సల్టెన్సీని తొలగించి.. పునరుద్ధరించిన వైనం
- హైకోర్టు నిర్మాణ పనుల్లో నాణ్యత, అంచనాలు పెరిగే అవకాశాలపై అనుమానాలు
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న తెలంగాణ నూతన హైకోర్టు(Telangana's new High Court building) భవన సముదాయం రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన న్యాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటి. అయితే, ఈ భారీ నిర్మాణంలో నాణ్యత, వ్యయ నియంత్రణ, కాంట్రాక్టు నిబంధనల అమలు, అధికారుల జవాబుదారీతనంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. భారీ ప్రజాధనంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి. ప్రతి నిర్మాణ మార్పునకూ సముచిత కారణం ఉండాలి. మరి ఈ బాధ్యతలను పర్యవేక్షించేది ఎవరు?
అక్టోబర్ 10 (విజయక్రాంతి): 2024 డిసెంబర్ 7న జారీ చేసిన జీఓ ఆర్టీ నంబర్ 827 ద్వారా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం(Government for the project) రూ. 2,583 కోట్ల పరిపాలనా ఆమోదం తెలిపింది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ప్లంబింగ్ తదితర పనులకు రూ.1,980 కోట్లతోపాటు ఫర్నిచర్, నిర్వహణ పరికరాల కోసం రూ.603 కోట్లు కేటాయించారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. ఈ సముదాయం మొత్తం 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది.
ప్రధాన సివిల్ నిర్మాణ పనులను డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. రూ.1,443.73 కోట్లుగా అంచనా వేసిన కాంట్రాక్టు విలువపై సుమారు 4.95 శాతం అధిక ధరకు ఈ పనులను కేటాయించారు. నిర్మాణ రూపకల్పన, డ్రాయింగులు, నాణ్యత తనిఖీలు, బిల్లుల ధ్రువీకరణ, పను ల పర్యవేక్షణ వంటి కీలక పనుల కోసం న వంబర్ 2024లో టీమ్ వన్ ఇండియా ప్రై.లి.ను ప్రధాన కన్సల్‌టెంట్‌గా నియమించారు. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ వ్యవస్థలో హైకోర్టు న్యాయమూర్తులకు కూడా భాగస్వామ్యం ఉంది.
బయటపడ్డ లోపాలు..
నిర్మాణ పనులు ప్రారంభమైన కొద్దికాలానికే టీమ్ వన్ ఇండియా పలు సాంకేతిక అంశాలపై అధికారికంగా అభ్యంతరాలు వ్య క్తం చేసినట్లు తెలుస్తోంది. నిర్మాణ నాణ్యతలో లోపాలు, ఆమోదించిన డిజైన్లకు భి న్నంగా పనులు చేపట్టడం, పనుల పురోగతిలో జాప్యం, అదనపు వ్యయాలు, అదనపు పనుల పేరుతో చెల్లింపులు కోరడం, అవసరం లేని పనులను చేపట్టడం వంటి అంశా లను ఆ సంస్థ లేవనెత్తింది.
రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)కి పంపిన సమాచారం లో, శాఖాధికారులు, కాంట్రాక్టు సంస్థ నిర్ల క్ష్యం కారణంగా అదనపు భారం మోపే ప్ర మాదం ఉందని కన్సల్టెంట్ అభిప్రాయపడినట్టు సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. నిర్మా ణ పనులు ప్రారంభించిన కేవలం మూడు నెలల వ్యవధిలోనే కొన్ని నిర్మాణ వ్యత్యాసాలను గుర్తించినట్లు పేర్కొనడం ఈ వ్యవహా రంలోని తీవ్రతకు అద్దంపడుతోంది.
టెండర్‌లో నిర్దేశించిన 75 లేదా 100 మిల్లీమీటర్ల మందానికి బదులుగా 150 మిల్లీమీటర్ల మందంతో ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ (పీసీసీ) పనులు చేపట్టి, ఆ మేరకు అధిక పరిమాణంలో బిల్లులు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఆమో దించిన 125 మిల్లీమీటర్ల మందానికి బదులుగా గ్రేడ్ స్లాబ్ మందాన్ని 175 మిల్లీమీ టర్లకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే మరో కీలక అంశమైన.. సాయిల్ బేరింగ్ కెపాసిటీ (మట్టి బరువు మోసే సామర్థ్యం కి సంబంధించినది.
నిర్మాణ స్థలం లో నేల బరువు మోసే సామర్థ్యాన్ని చదరపు మీటరుకు 40 నుంచి 50 టన్నులుగా పరిమితం చేసినప్పటికీ, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అది 70 నుంచి 100 టన్నులకు మించి ఉండే అవకాశముందని కన్సల్‌టెంట్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ వ్యత్యాసం కారణంగా అవసరాని కంటే ఎక్కువగా పునాదుల రూపకల్పన జరి గి, నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉన్నదనేది ప్రధాన ఆందోళన.
టెండర్‌లో పేర్కొన్న షట్టరింగ్ విధానానికి బదులుగా అల్యూమినియం షట్టరింగ్ ను ఉపయోగించినట్లు చూపించారనే అ భ్యంతరాన్ని సదరు కన్సల్టెంట్ లేవనెత్తింది. సాధారణంగా కాంట్రాక్టర్ బాధ్యతలో భా గంగా ఉండే టాప్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ సపోర్టింగ్ చైర్లను పేరు మార్చి ప్రత్యేక పనిగా చూపించి అదనపు చెల్లింపులు కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంలో సు మారు 550 మెట్రిక్ టన్నుల ఉక్కుకు సం బంధించిన వ్యవహారం ఉందని పేర్కొన్నారు.
పార్కింగ్ ప్రాంతంలోని ‘బే’ల అమ రికలోనూ మార్పులు చోటుచేసుకున్నట్లు కన్సల్టన్సెన్సీ అభ్యంతరం వెల్లడించినట్టు సమాచారం. మొదట రెండు లేదా మూడు ‘బే’లను అమర్చేందుకు ప్రతిపాదించగా.. వ్యవస్థను నాలుగు ‘బే’ల అమరికగా మార్చడంతో, పోస్ట్-టెన్షన్డ్ స్లాబ్ విధానాన్ని అనుస రించాల్సి వచ్చిందని, తద్వారా నిర్మాణంలో మార్పులతో పాటు వ్యయం పెరిగే పరిస్థితి ఏర్పడిందని కన్సల్టెంట్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.
ఈ మార్పులను రోడ్లు, భవనాల శాఖ ఆమోదించినట్లు పేర్కొనడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. టెండర్‌లో ముందుగా నిర్ణ యించిన ప్రమాణాలకు భిన్నంగా మార్పు లు చేయాల్సిన అవసరం ఏమిటి? అలా మార్చేందుకు సరైన సాంకేతిక కారణాలున్నాయా? వాటి వల్ల ప్రభుత్వంపై పడే అద నపు ఆర్థిక భారాన్ని సమగ్రంగా అంచనా వేశారా? నిర్మాణ ప్రారంభ దశలోనే ఇలాం టి వ్యత్యాసాలు చోటుచేసుకుంటే,
భవిష్యత్తులో వాటి ప్రభావం మరింత పెరిగే ప్రమా దం ఉందని కన్సల్టెంట్ హెచ్చరించినట్లు సమాచారం. ప్రస్తుత టెండర్ విలువతో పోలిస్తే మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.౫వేల కోట్ల వరకు పెరిగే ప్రమాదం ఉందన్న అంచనానూ కన్సల్టెంట్ ప్రస్తావించింది. అయితే, ఇది అంతిమంగా నిర్ధారిం చింది మాత్రం కాదు. కేవలం అదనంగా నిర్మాణ పనులను చేర్చడం వల్ల అదనపు భారం పడనుందని చేసిన హెచ్చరికగా చూడాలి.
ఒప్పందం రద్దు.. పునరుద్ధరణ..
ఈ అభ్యంతరాలపై సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన సమయంలో, టీమ్ వన్ ఇండి యా పరిధిలో ఉన్న బిల్లుల ధ్రువీకరణ బా ధ్యతను తొలగించి, ఆ పనిని మరో కన్సల్టెంట్‌కు అప్పగించినట్లు సమాచారం. ఆ కొత్త కన్సల్టెంట్ శాఖాధికారులు, కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రా యం కూడా వ్యక్తమైంది. అయితే, ప్రభుత్వంపై అదనపు వ్యయభారం మోపుతూ కాంట్రాక్టర్‌కు ప్రయోజనం కలిగించే అవకాశం ఉన్న నిర్మాణ వ్యత్యాసాలను టీమ్ వన్ ఇండియా ప్రస్తావించడం కొనసాగించడంతో,
ఆర్ అండ్ బీ శాఖ ముందస్తు నోటీ సు లేకుండానే సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసినట్లు సమాచారం. ఈ ఆకస్మిక నిర్ణయంపై కన్సల్టెంట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అ నంతరం ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, టీమ్ వన్ ఇండియాకు కన్సల్టెన్సీ బాధ్యతలను తిరిగి అప్పగించింది. అయితే, ఒప్పందం పునరుద్ధరణ తర్వాత గతంలో ప్రస్తావించిన నిర్మాణ వ్యత్యాసాలు, నాణ్యతాపరమైన సందేహాలు, వ్యయ పెరుగుదల అంశాలపై ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు.
ఇక్కడే మరో కీలక ప్రశ్న తలెత్తు తోంది. గతంలో లోపాలను ఎత్తిచూపిన కన్సల్టెంట్ ఇప్పుడు వాటిపై స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించగలుగుతుందా? వృత్తిపరమైన జాగ్రత్తల కారణంగానా, సం స్థాగత ఒత్తిళ్ల వల్లనా, లేక మరేదైనా పరిస్థితుల వల్లనైనా ఈ అంశాలపై చర్చ మాత్రం లేదు. దీనికి సమాధానం స్పష్టమైన పత్రా లు, పారదర్శక నివేదికలు, స్వతంత్ర తనిఖీల ద్వారానే లభించాల్సి ఉంది.
తరతరాలకు నిలవాల్సిన న్యాయ మందిరం..
రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన సముదాయం కేవలం ప్రభుత్వ నిర్మాణం కాదు. అది న్యాయవ్యవస్థ గౌరవాన్ని ప్రతిబింబించాల్సిన సంస్థాగత కట్టడం. తరతరాల పాటు సేవలందించాల్సిన ఈ సముదాయం నిర్మాణ నాణ్యతలోనూ, రూపకల్పనలోనూ, ప్రజాధన వినియోగంలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటించాలి. అందుకే శంకుస్థాపనలు, అధికారుల తనిఖీలు, పురోగతి ప్రకటనలు మాత్రమే ఈ ప్రాజెక్టు నాణ్యతను నిర్ణయించవు.
పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యాయా అన్నదానితో పాటు, నిర్దేశిత ప్రమాణాలతోనే నిర్మించారా? వ్యయాన్ని సమర్థవంతంగా నియంత్రించారా? అదనపు చెల్లింపునూ న్యాయబద్ధంగా ధ్రువీకరించారా? లోపాలను ఎత్తిచూపిన వారిని ప్రోత్సహించారా, లేక వారి స్వతంత్రతకు ఆటంకాలు ఏర్పడ్డాయా? అన్న ప్రశ్నలకు కూడా సమాధానా లు లభించాలి. ప్రజాధనంతో నిర్మిస్తున్న హైకోర్టు భవన సముదాయం నాణ్యతకు హామీ ఇచ్చేది ఎవరు?
వ్యయ నియంత్రణకు బాధ్యత వహించేది ఎవరు? ఏవైనా అక్రమాలు, అవకతవకలు జరిగితే జవాబుదారీగా నిలబడాల్సింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఆరోపణలను ఖండించడంలోనో, అధికారిక ప్రకటనలు చేయడంలోనో లేదు. స్వతంత్ర తనిఖీలు, స్పష్టమైన పత్రా లు, పారదర్శకమైన నిర్ణయాలు, నిరంతర పర్యవేక్షణ, తప్పిదాలకు బాధ్యత వహించే వ్యవస్థలోనే ఉంది. న్యాయానికి ప్రతీకగా నిలవాల్సిన ఈ భవనం నిర్మాణంలోనూ న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం ప్రతిబింబించాలి.
గడువు ఒత్తిడిలో.. నాణ్యతకు విఘాతం..
ఈ భారీ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికిగానీ.. లేదా నిర్మాణం ప్రారంభించిన మూడేళ్ల వ్యవధిలో పూర్తిచేయాలని అధికారిక ప్రకటనలో చెప్పారు. 2025 డిసెంబర్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థా యి అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా, నిర్మాణ డ్రాయింగులను స కాలంలో అందించడం, కాంట్రాక్టర్ పనులను వేగవంతం చేయడం, పురోగతిని తరచుగా సమీక్షించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
అనంతరం అదనపు జోన్లకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలతో ప్రాజెక్టును వేగంగా పూర్తి చే యాలని ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. అయితే, నిర్ణీత గడువులో ప్రాజెక్టు ను పూర్తి చేయాలనే నెపంతో నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ప్రారంభ దశలోనే నిర్మాణ ప్రమాణాలు, డిజైన్లు, పరిమాణాలు, చెల్లింపుల విషయంలో వ్య త్యాసాలు ఉంటే, వాటిని వెంటనే సరిదిద్దకపోతే భవిష్యత్తులో నిర్మాణంలో జా ప్యం..
అదనపు ఖర్చులు, నాణ్యతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పునాదులు, రీఇన్‌ఫోర్స్‌మెం ట్, స్లాబ్‌ల వంటి నిర్మాణ భాగాల్లో జరిగే మార్పులు తరువాత సులభంగా గుర్తించలేని పరిణామాలకు దారితీయవచ్చు. అం దువల్ల, పనుల్లో వేగం ఎంత ముఖ్యమో, ప్రతి దశలో సాంకేతిక ప్రమాణాలను పాటించడం కూడా అంతే ముఖ్యం.
పర్యవేక్షణ సరే.. జవాబుదారీతనం ఎక్కడ?
ఈ ప్రాజెక్టులో అసలు సమస్య నిర్మాణం జరుగుతోందా లేదా అన్నది కాదు. ఆమోదించిన నిబంధనల ప్రకారమే నిర్మాణ పనులు జరుగుతున్నా యా? ప్రజాధనం సమర్థవంతంగా వినియోగిస్తున్నారా? నాణ్యతను స్వతంత్రం గా ధ్రువీకరించే వ్యవస్థ నిజంగా పనిచేస్తోందా? అన్నదే కీలక ప్రశ్న. ఒకవైపు ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పను లు చేపడుతోంది. మరోవైపు రాష్ట్ర ప్ర భుత్వ ఆర్ అండ్ బీ శాఖ కాంట్రాక్టు నిర్వహణ, ప్రభుత్వ నిధుల వినియోగం వంటి బాధ్యతలను నిర్వర్తించాలి.
న్యా యమూర్తుల భాగస్వామ్యంతో పర్యవేక్షణ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రారం భంలో స్వతంత్ర నాణ్యత తనిఖీలు, బి ల్లుల ధ్రువీకరణ బాధ్యతలు చేపట్టిన కన్సల్టెంట్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ వ్యవస్థ ప్రస్తుతం ఎంత సమర్థవంతంగా పనిచేస్తోందన్నది ప్రజలకు తెలియాలి.
కాంక్రీట్ మందం, పునాదుల రూపకల్పన, రీఇన్‌ఫోర్స్‌మెంట్ పరిమాణా లు, నిర్మాణ సాంకేతికత వంటి అం శాలు ఆమోదించిన టెండర్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించేది ఎవరు? నేల పరీక్షల నివేదికలు, నిర్మాణ సామగ్రి వినియోగం, అదనపు పనుల బిల్లులను స్వతంత్రంగా పరిశీలించేది ఎవరు? ప్రతి మా ర్పుకు సంబంధించిన సాంకేతిక సమర్థన, ఆర్థిక ప్రభావం, ఆమోద ప్రక్రియ ను పర్యవేక్షించేది ఎవరు?
ప్రాజెక్టు మొత్తం వ్యయం ఆమోదించిన రూ.2,583 కోట్లను గణనీయంగా మించి పెరగకుండా నియంత్రించే బా ధ్యత ఎవరిది? ఒకవేళ వ్యయ పెరుగుదల అనివార్యమైతే, దానికి సంబంధిం చిన కారణాలు, ఆమోదాలు, ప్రజాధనంపై ప్రభావం బహిరంగంగా వెల్లడవు తున్నాయా? లాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. న్యాయమూర్తులతో కూడిన పర్యవేక్షణ వ్యవస్థకు ఈ అంశాలపై పారదర్శకతను నిర్ధారించే బాధ్యత ఉంది.
ప్రతి నిర్మాణ వ్యత్యాసానికి సంబంధించిన రికార్డులను భద్రపరచడం, థర్డ్ పార్టీతో నాణ్య తా పరీక్షలు నిర్వహించడం, నేల పరీక్షల సమాచారాన్ని ధ్రువీకరించడం, సామ గ్రి పరిమాణాలు, బిల్లుల పరిశీలించడం వంటి చర్యలు తప్పనిసరిగా తీసు కోవాలి.
అలాగే.. అసలు టెండర్ పరిమాణాల నుంచి ఏదైనా మార్పు చేయాల్సి వస్తే, దానికి స్పష్టమైన సాంకేతిక కారణాలు ఉండాలి. సంబంధిత అధికారుల నుంచి లిఖితపూర్వక ఆమోదం పొందా లి. అదనపు వ్యయాన్ని ముందుగానే లెక్కించి, దాని ప్రభావాన్ని నమోదు చేయాలి. ఈ ప్రక్రియలో ఎలాంటి అస్పష్టతకు, అనుమానాలకు తావుండకూడదు. ఆర్ అండ్ బీ శాఖ తన పరిపాలనా, కాంట్రాక్టు బాధ్యతలను సమర్థవంతం గా నిర్వర్తించాలి.
కాంట్రాక్టర్ ఒప్పందంలోని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. తిరిగి బాధ్యతలు చేపట్టిన కన్సల్టెంట్ కూడా తన వృత్తిపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లోపాలను నమో దు చేసి, అవసరమైన చోట అభ్యంతరాలు వ్యక్తంచేయాలి. ఈ బాధ్యతలు నిరంతరంగా, పారదర్శకంగా అమలుకాకపోతే, ప్రారంభ దశలో కనిపించిన వ్యత్యాసాలు కాలక్రమేణా పెరిగి, నాణ్యత దెబ్బతినడంతో పాటు ప్రభుత్వంపై అనవసరమైన ఆర్థిక భారం పడే ప్రమాదం ఉంటుంది.