పాలన చేరువైంది.. ప్రగతి పడకేసింది!
- ఉమ్మడి మెదక్ విభజనకు నేటితో 11 ఏళ్లు
- తీరని సమస్యల సుడిగుండంలో మూడు జిల్లాలు
- మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల ఏర్పాటుతో మారిన భౌగోళిక స్వరూపం
- పాలనా సౌలభ్యం పెరిగినా అభివృద్ధిలో వెనుకబాటు
- రైతాంగాన్ని వేధిస్తున్న నిరంతర కరెంట్ కోతలు, అసంపూర్తి ప్రాజెక్టులు (ఎ.చంద్రశేఖర్ రావు)
సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): పరిపాలనను(administration) ప్రజల వద్దకు చేర్చాలనే ప్రధాన లక్ష్యంతో 2016 అక్టోబర్ 11న ఉమ్మడి మెదక్ జిల్లా మూడు ముక్కలైంది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలుగా ఏర్పడి నేటితో సరిగ్గా పదేళ్లు పూర్తయి 11వ వసంతంలోకి అడుగుపెడుతోంది.
నాడు సరికొత్త ఆశలతో, ఆకాంక్షలతో ఉద్భవించిన ఈ మూడు జిల్లాల్లో పాలనా యంత్రాంగం ప్రజలకు దగ్గరైందన్న మాట వాస్తవమే అయినా, దశాబ్దం దాటినా ఇంకా అనేక మౌలిక సమస్యలు, ప్రాంతీయ వెనుకబాటుతనం ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. ఒక వైపు సిద్దిపేట అభివృద్ధిలో మోడల్‌గా నిలుస్తుండగా, మరోవైపు సంగారెడ్డి పారిశ్రామిక హబ్‌గా మారుతోంది. కానీ మాతృ జిల్లా అయిన మెదక్ మాత్రం నేటికీ ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేక వెనుకబడే ఉంది.
భూములకు 22 ఏ ఉచ్చు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూ యజమానులను, రైతులను అత్యంత తీవ్రంగా వేధిస్తున్న సమస్య 22ఏ నిషేధిత భూముల జాబితా. అందుబాటులో ఉన్న తాజా ప్రాథమిక లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాలకు పైగా భూములు ఈ నిషిద్ధ జాబితాలో చిక్కుకుపోయాయి.
ఇందులో ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 25 వేల ఎకరాలు ఉండగా, సిద్దిపేటలో 11 వేలు, మెదక్ జిల్లాలో 6 వేల ఎకరాల భూములు ఉన్నాయి. పట్టా భూములు సైతం ఈ జాబితాలోకి చేరడంతో రైతులు తమ సొంత భూములను అమ్ముకోలేక, అవసరానికి రుణాలు పొందలేక, బ్యాంకుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కరెంట్ కష్టాలు
గత కొన్ని నెలలుగా ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా సమస్యలు మళ్లీ ముదిరాయి. హత్నూర, నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి, చిలిపిచేడు వంటి మండలాల్లో నిరంతరాయంగా విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. 17.5 లక్షలకు పైగా ఉన్న కనెక్షన్ల పరిధిలో అప్రకటిత విద్యుత్ కోతలు, లో-వోల్టేజీ సమస్యల వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్ అవ్వడం, బోరు మోటర్లు కాలిపోవడం నిత్యకృత్యమైంది.
దీనికి తోడు భూగర్భజలాలు అడుగంటుతుండటం, కాళేశ్వరం సాగునీరు అన్ని ప్రాంతాల చివరి ఆయకట్టుకు అందకపోవడం రైతులను రోడ్లపైకి తెచ్చి ధర్నాలకు దారితీస్తోంది.
మెదక్ వెనుకబాటుతనం
జిల్లాల విభజనతో పారిశ్రామిక రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న పటాన్‌చెరు, పాశమైలారం, బొల్లారం వంటి కీలక ప్రాంతాలన్నీ సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో సంగారెడ్డి ఆర్థికంగా, ఐఐటీ వంటి విద్యాసంస్థలతో బలపడింది. సిద్దిపేట జిల్లా కూడా రాజకీయ ప్రాధాన్యతతో కొత్త హంగులు అద్దుకుంది. కానీ మెదక్ జిల్లా మాత్రం కేవలం 20 మండలాలతో, పరిమిత వనరులతో కుదించుకుపోయింది. జిల్లాలో కేవలం ఘనాపూర్ ఆనకట్ట వంటి పాత ప్రాజెక్టులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
నారాయణఖేడ్, అందోల్ రూరల్ పరిధులు, మెదక్ ఏజెన్సీ వైపు ఉన్న గ్రామాలు ఉపాధి అవకాశాలు లేక వలసల బాట పడుతున్నాయి. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో వందలాది బహుళజాతి కంపెనీలు కొలువుదీరి కోట్లాది రూపాయల సంపదను సృష్టిస్తున్నప్పటికీ, స్థానిక యువతకు మాత్రం ఉద్యోగాల లబ్ధి దక్కడం లేదు.
పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలన్న నిబంధనలు కాగితాలకే పరిమితం కాగా, సాంకేతిక నైపుణ్యాల కొరత సాకుతో యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల వారికే ప్రాధాన్యమిస్తున్నాయి. స్థానిక యువతకు ఆధునిక పరిశ్రమలకు తగ్గ నైపుణ్యాలను నేర్పించే శిక్షణా కేంద్రాలు నామమాత్రంగా మారడంతో వేలాది మంది ఇంజనీరింగ్, డిగ్రీ పట్టభద్రులు పరిశ్రమల గేట్ల ముందే సెక్యూరిటీ గార్డులుగా, ఒప్పంద కూలీలుగా మిగిలిపోతున్నారు.
వసతుల లేమి, అసంపూర్తి భవనాలు
కొత్త జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు నిర్మించినప్పటికీ, డివిజన్, మండల స్థాయిల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వందలాది అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు.
ఒక్క మెదక్ జిల్లాలోనే దాదాపు 360కి పైగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వైద్య రంగంలో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ వచ్చినా, మెదక్, సిద్దిపేట పరిధిలోని మారుమూల గ్రామ ప్రజలకు అత్యవసర వైద్యం కోసం నేటికీ హైదరాబాద్‌పైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది.
ఇకనైనా ప్రగతి దక్కేనా?
జిల్లాలు ఏర్పాటై పదేళ్లు పూర్తయి 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ శుభసందర్భంలో పాలకుల ఉత్సవాల ఆర్భాటాలు ఎలా ఉన్నా ప్రజల గొంతుక మాత్రం ఒక్కటే వినిపిస్తోంది. పాలనను చేరవ చేసినందుకు సంతోషమే, కానీ ప్రాంతీయ వెనుకబాటుతనాన్ని తొలగించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి కల్పించినప్పుడే ‘విభజన‘ ఆశయం పూర్తిగా సిద్ధిస్తుందని ఉమ్మడి మెదక్ ప్రజలు కోరుకుంటున్నారు.