యాప్‌ సోపాలు

28-09-2026 | 05:30am

డేటా ఎంట్రీలతో టీచర్ల కుస్తీ.. ప్రాథమిక విద్యకు సుస్తీ

  1. స్కూల్ మొదలు కాగానే ఓ యాప్‌లో అటెండెన్స్
  2. లంచ్ టైమ్‌లో ఇంకో యాప్‌లో భోజన వివరాలు
  3. చాక్‌పీస్ కొనాలన్నా ఆన్‌లైన్‌లో నమోదు మస్ట్
  4. సరిగ్గా అందని సిగ్నల్స్.. సతాయిస్తున్న సర్వర్
  5. బోధన తక్కువ.. ‘డేటా ఎంట్రీ’కే టైమంతా వేస్ట్ 
  6. ఉండేది ఒకరిద్దరు ఉపాధ్యాయులే.. పనులన్నీ వాళ్లకే!
  7. రాష్ట్రంలో 12 వేల పాఠశాలల్లో ఇదీ దుస్థితి
  8. తీవ్ర మానసిక క్షోభ.. రెండేండ్లలో ఆగిన 12 మంది టీచర్ల గుండెలు
  9. ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం

బడి గంట మోగింది.. పిల్లలు పుస్తకాలు తెరిచి టీచర్ వైపు ఆశగా చూస్తున్నారు. కానీ, అక్కడ టీచర్ మాత్రం పాఠం చెప్పడం మర్చిపోయి, చేతిలో మొబైల్ పట్టుకుని నెట్‌వర్క్ సిగ్నల్  కోసం కిటికీ వైపు పరుగు తీశారు. స్మార్ట్‌ఫోన్‌లోని యాప్స్‌ను ఆపరేట్ చేస్తూ, అంకెలను నమోదు చేయడంలో మునిగిపోయారు. ఇవీ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో (Government Primary School) నిత్యం ఎస్జీటీలు పడుతున్న ఆపసోపాలు! అక్షరాలు దిద్దించాల్సిన చేతులు.. నేడు కేవలం ‘డేటా ఎంట్రీ’ పనులకే పరిమితం కావాల్సివస్తున్నది. అటెండెన్స్ ఎంట్రీకి ఒక యాప్.. మధ్యాహ్న భోజన వివరాల ఎంట్రీకి మరో యాప్.. చాక్‌పీస్ కొనాలంటే ఇంకో పోర్టల్.. ఇలా వాటిలో వివరాల నమోదుకే టైమంతా  గడిచిపోతున్నదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిందిపోయి.. డేటా ఆపరేటర్ పనులు చేయాల్సి వస్తున్నదని గోసపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12వేల స్కూళ్లలో ఇదే దుస్థితి కనిపిస్తున్నది.

(ఎ చంద్రశేఖర్ రావు)

సంగారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఒకప్పుడు టీచర్ బాధ్యత కేవలం రిజిస్టర్‌లో హాజరు వేసి, పాఠాలు చెప్పడమే. కానీ, నేడు డిజిటలైజేషన్(Digitalization) పేరుతో విద్యాశాఖ ప్రవేశపెట్టిన డజన్ల కొద్దీ యాప్స్ వారికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. బడి ప్రారంభం కాగానే అటెండెన్స్ యాప్‌తో విద్యార్థుల హాజరును నమోదు చేయాలి.  మధ్యాహ్న భోజనం ఎంతమంది తిన్నారు? ఏ మెనూ వండారు? కోడిగుడ్లు ఎన్ని వచ్చా యి? అనే వివరాలు లంచ్ టైమ్‌లో మిడ్ డే మీల్స్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రతి ఉపాధ్యాయుడి ప్రగతితో పాటు, విద్యార్థుల మార్కులు, ప్రగతి పత్రాలను ఆన్‌లైన్‌లోనే పొందుపరచాలి. అలాగే మరుగుదొడ్ల ఫొటోలు మొదలు పాఠశాల నిధుల ఖర్చుల దాకా ప్రతిదీ యాప్స్‌లోనే నింపాల్సిన పరిస్థితి టీచర్లది. 

ఆ జీవో ఫలితంగా..!

గతంలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే పద్ధతి అమల్లో ఉండేది. కానీ, 2022లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 25 ప్రాథమిక విద్యకు శాపంగా మారింది. విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని ఉపాధ్యాయులను కుదించడంతో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. స్కూల్ లో -60 మందిలోపు విద్యార్థులుంటే కేవలం ఇద్దరు టీచర్లే ఉండాల్సిన పరిస్థితి. ఇందులో ఒక టీచర్ మూడు తరగతులు, మరొకరు రెండు తరగతులు చెప్పడంతో పాటు హెచ్‌ఎం బాధ్యతలు, మధ్యాహ్న భోజనం ప్రక్రియను చూసుకోవాలి.

30 మందిలోపు విద్యార్థులుంటే ఒకే ఒక్క టీచర్ ఉండాల్సిన పరిస్థితి. ఆ ఒక్కరే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులు బోధించాలి. మధ్యాహ్న భోజన రికార్డులు రాయాలి, ఆన్‌లైన్ డేటా ఎంట్రీలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 12వేలకు పైగా పాఠశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది.

రాష్ట్రంలో దాదాపు 60 శాతానికి పైగా ఉన్న ప్రాథమిక బడుల్లో ఒకరు లేదా ఇద్దరు టీచర్లతోనే బహుళ తరగతుల సర్కస్ సాగుతున్నది. ఒక క్లాసుకు పాఠం చెప్తుంటే మిగతా నాలుగు తరగతుల పిల్లలను గాలికి వదిలేయాల్సిన పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వ బడుల్లో నాణ్యత దిగజారి, తల్లిదండ్రులు ప్రైవేట్ బాట పట్టడంతో ఇప్పటికే 15 శాతం ఎన్‌రోల్‌మెంట్ పడిపోయింది.

ఏది కొనాలన్నా..!

ప్రతి విద్యార్థికి రోజూ ఐదు యాక్టివిటీలు చేయించాలి. వాటికి ఫొటోలు, వీడియోలు తీసి ఎప్పటికప్పుడు యాప్స్‌లో అప్‌లోడ్ చేయాలి. కనీసం సెల్‌ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ లేని ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లోనూ ఇదే ఆంక్షలు విధించడంతో ఉపాధ్యాయుల సమయమంతా మొబైళ్లతో కుస్తీ పట్టడానికే సరిపోతున్నదిది.

దీనికి తోడు కొత్తగా ప్రవేశపెట్టిన స్పర్శ్ ఫైనాన్షియల్ పోర్టల్ ఎస్జీటీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. స్కూల్‌కు ఒక చాక్‌పీస్ డబ్బా, చీపురు కొనాలన్నా వెండర్ల నమోదు, డిజిటల్ కీలు, బిల్లుల అప్‌లోడ్ కోసం రోజంతా సెల్‌ఫోన్ల ముందే సమయం వృథా అవుతున్నది. బోధనను వదిలేసి గుమస్తాగిరి చేయాల్సి వస్తున్నదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. 

సర్వర్ డౌన్.. టీచర్లకు టెన్షన్..

యాప్స్ నిర్వహణలో ప్రధాన సమస్య సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడం. ఒక సమాచారాన్ని నమోదు చేయాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో, ఉపాధ్యాయులు రాత్రి వేళల్లో ఇండ్ల వద్ద కూర్చుని కూడా ఈ పనులను పూర్తి చేయాల్సి వస్తున్నది. సమయానికి డేటా అప్‌లోడ్ చేయకపోతే ఉన్నతాధికారుల నుంచి మెమోలు, షోకాజ్ నోటీసులు వస్తాయనే భయంతో ఎస్జీటీలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. 

ఉండేదే ఒకరిద్దరు.. పనులన్నీ వాళ్లకే! 

* ప్రాథమిక పాఠశాలల్లో సాధారణంగా ఒకటి లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు. ఉన్న ఆ ఒక్కరు కూడా ఇలా రోజుకు మూడునాలుగు గంటలు యాప్స్ నిర్వహణ, లెక్కల చిట్టాలు రాయడానికే కేటాయిస్తే, ఇక విద్యార్థులకు నాణ్యమైన చదువు ఎలా అందుతుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. 

* పునాది దశలోనే విద్యార్థులకు అక్షరాస్యత, కనీస గణిత నైపుణ్యాలు లోపించడానికి ఈ అదనపు భారమే ప్రధాన కారణమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. 

* తమను కేవలం విద్యాబోధనకే పరిమితం చేయాలని, ఈ ఆన్‌లైన్ అటెండెన్స్, మిడ్ డే మీల్స్ వంటి నాన్-టీచింగ్ పనుల కోసం ప్రత్యేకంగా క్లర్కులను లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. డిజిటల్ సంస్కరణలు మంచివే అయినప్పటికీ, అవి బోధనకు ఆటంకం కలిగించేలా ఉండకూడదని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ‘యాప్స్ కుస్తీ’ నుంచి తమకు విముక్తి కల్పించాలని వారు అంటున్నారు. 

* రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 40 వేల మంది ఎస్జీటీలు పనిచేస్తున్నారని, వీళ్లంతా బోధన కన్నా డేటా ఎంట్రీలకే టైమ్ ఎక్కువ కేటాయించాల్సి వస్తున్నదని ఎస్టీటీ ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంతోపాటు ఈ డేటా ఎంట్రీ వర్క్ ను తగ్గించాలన్న డిమాండ్‌తో టీచర్లు ఉద్యమానికి రెడీ అవుతున్నారు. 

రెండేండ్లలో 12 మంది బలి

తరగతి గదిలో చదువు ఎలా సాగుతుందో చూడకుండా రిజిస్టర్లు నిండాయా, యాప్స్‌లో ఫొటోలు పెట్టారా, హాజరు వేశారా, హరితహారం మొక్కలు బతికాయా.. పాఠశాలల తనిఖీల సమయంలో టీచర్లకు విద్యాశాఖ అధికారులు వేసే ప్రశ్నలు ఇవే! పిల్లలకు చదవడం ఎందుకు రాలేదు? అని నిలదీస్తున్నారు. కానీ, పిల్లలకు పాఠం చెప్పడానికి టీచర్‌కు లభిస్తున్న నికర సమయం ఎంతన్నదాన్ని పట్టించుకోవడం లేదు. పైనుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా టైమ్ అంతా యాప్స్ కోసమే కేటాయించాల్సి వస్తున్నదని టీచర్లు ఆందోళన చెందుతున్నారు.

ఈ నిరంతర ఒత్తిడి, మానసిక ఆందోళనలతో ఎస్జీటీలు బీపీ, షుగర్ బారిన పడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా చిల్వకోడూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి ఘటనే ఇందుకు నిదర్శనం. మండల స్కూల్ కాంప్లెక్స్ సమావేశం సాగుతుండగానే ఆ ఉపాధ్యాయుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలానికి దారితీసింది. వెంటనే సహచరులు ఆసుపత్రికి తరలించారు. గత రెండేండ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 మంది ఎస్జీటీలు విధి నిర్వహణలోని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోట్లతో మరణించారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు