బ్లాస్టింగ్‌తో భయాందోళనలు
కలెక్టర్‌కు గ్రామస్థుల ఫిర్యాదు..
బ్లాస్టింగ్‌తో ఇళ్లు బీటలు.. దుమ్ము, ధూళితో ప్రజలకు అవస్థలు
నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జిన్నారం,సెప్టెంబర్ 28: జిన్నారం మండలం(Jinnaram Mandal) గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామ సమీపంలో సర్వే నంబర్ 210లో నిర్వహిస్తున్న రాక్‌సాండ్, ఏఏఏ స్టోన్ క్రషర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. క్రషర్ యూనిట్లు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ కలెక్టర్‌కు(Collector) ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. క్రషర్ యూనిట్లలో రాత్రింబవళ్లు బ్లాస్టింగ్, రాళ్లను క్రషింగ్ చేయడం వల్ల భారీగా దుమ్ము, ధూళి వెలువడుతోందని తెలిపారు. దీంతో గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బ్లాస్టింగ్ కారణంగా ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, పెద్ద శబ్దాలు, ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. క్రషర్ల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై పడటంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ భూములపై దుమ్ము పేరుకుపోవడంతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతోందని తెలిపారు.
రహదారులపై క్రషర్ వాహనాల(Crusher vehicles) రాకపోకలతో కూడా దుమ్ము విపరీతంగా లేస్తోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా రాయల్టీ పేరుతో అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారనే ఆరోపణలు కూడా గ్రామస్థులు చేశారు. క్రషర్ యూనిట్ల నిర్వహణ, బ్లాస్టింగ్, రాయల్టీ చెల్లింపులు తదితర అంశాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలితే సంబంధిత క్రషర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బ్లాస్టింగ్ వల్ల ఇళ్లకు జరిగిన నష్టాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్థులు కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు.ఈ సీతారం యాదవ్, మల్లేష్, కుమార్, భజరంగ్ సింగ్, నరసింహ, గణేష్, చంద్రయ్య, పాల్గొన్నారు.