మాదారాన్ని కమ్మేసిన కాలుష్య మేఘాలు

10-11-2026 | 10:05am

జిన్నారం, నవంబర్ 10 (విజయక్రాంతి): గడ్డపోతారా మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామాన్ని విషపూరిత పొగలు కమ్మేస్తున్నాయి. కొత్తకుంటలో డోర్ల కంపెనీకి చెందిన వ్యర్థాలను పెద్ద ఎత్తున డంపింగ్ చేసి, వాటికి నిప్పంటిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యర్థాల దహనంతో వెలువడుతున్న దట్టమైన పొగ గ్రామమంతా వ్యాపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొత్తకుంటలో కంపెనీ వ్యర్థాలను బహిరంగంగా పడేసి తగలబెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలన్నీ పొగతో నిండిపోతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

పరిశ్రమల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో డంపింగ్ చేసి దహనం చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నామని, ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొత్తకుంటలో వ్యర్థాల డంపింగ్, దహనంపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామాన్ని కమ్మేస్తున్న పొగ కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు

మరిన్ని వార్తలు