రూ.21 కోట్లతో తెల్లాపూర్‌లో అండర్ బ్రిడ్జి మంజూరు
ఎంఎంటీఎస్ను నాగులపల్లి వరకు పొడిగించాలి
మెదక్ ఎంపీ రఘునందన్ రావు
రామచంద్రపురం, సెప్టెంబర్ 9: రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో 21 కోట్ల రూపాయల విలువైన రోడ్ అండర్ బ్రిడ్జి ని మంజూరు చేయించడం జరిగిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Medak MP Raghunandan Rao) తెలిపారు. బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాత్సవని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రైల్వే సమస్యలు, కొత్త ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లడుతూ మెదక్ పార్లమెంట్ పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇందులో భాగంగానే తెలాపూర్, భెల్ ప్రాంతాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్ యు బి )ని మంజూరు చేయించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు.శ నివారం రైల్వే అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి స్థల పరిశీలన చేస్తామని తెలిపారు.
తెల్లాపూర్ రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రయాణీకులకు ఉన్న అసౌకర్యాన్ని దూరం చేసేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేయించామని, ఈ నెలాఖరుకు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. లింగంపల్లి వరకు వస్తున్న ప్రతీ ఎంఎంటీఎస్ రైల్ ను ఇటు రామచంద్రాపురం, అటు నాగులపల్లి వరకు పొడగించాలని జీఎంను కోరినట్టు తెలిపారు.
పశ్చిమ హైదరాబాద్ లో జనావాసాలు పెద్దఎత్తున పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ నివారణతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఎంఎంటీఎస్ విస్తరణ ఏకైక మార్గమని తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని జీఎం తెలిపారని పేర్కొన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా తెల్లాపూర్ ప్రాంత అభివృద్ధి, ప్రజల రవాణా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ రఘునందన్ రావుకి తెల్లాపూర్ డివిజన్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.