గిరాయిపల్లిలో భూ భారతి రీ-సర్వేపై అవగాహన

16-09-2026 | 08:21pm

పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చర్యలు

కొండపాక, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కొండపాక మండలం(Kondapaka Mandal) గిరాయిపల్లి గ్రామాన్ని భూ భారతి రీ-సర్వేకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో బుధవారం రైతులు, గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఏడీఏ సుదర్శన్(ADA Sudarshan) ముఖ్యఅతిథిగా హాజరై తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డితో కలిసి రీ-సర్వే ప్రక్రియను వివరించారు.

ముందుగా గ్రామ సరిహద్దులు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను గుర్తించి, అనంతరం పట్టా భూముల హద్దులను ఖచ్చితంగా కొలిచి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ప్రతి భూమికి ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సల్ నంబర్), భూధార్ నంబర్ కేటాయించడంతో పాటు ఒకే భూమికి సంబంధించిన వివరాలను ఒకచోట చేర్చి, నాలుగు వైపుల హద్దులను నమోదు చేస్తామని పేర్కొన్నారు.

గిరాయిపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంపై సర్పంచ్ కాసపురం సంజీవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలోని రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, రీ-సర్వే ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేకు వచ్చే అధికారులకు గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తూ, రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ఆర్‌ఐ రామరాజు, జీపీఓ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి స్నేహప్రియ, ఏఈఓ సుస్మిత, వివిధ శాఖల అధికారులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు