కాలభైరవ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు
బెజ్జంకి, నవంబర్ 26 : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని శ్రీ స్వయంభూ కాలభైరవ అధిష్ఠాన ప్రత్యంగిరాదేవి దేవస్థాన ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(MLA Tanniru Harish Rao) పాల్గొన్నారు. గురువారం మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్‌తో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సనాతన ధర్మంలో పరమశివుడి ఉగ్రరూపాల్లో కాలభైరవుడు అత్యంత శక్తివంతమైన దైవమని అన్నారు. కాలం అంటే శివుడు, భైరవుడు అంటే భయాన్ని తొలగించేవాడని అర్థమని వివరించారు. కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకొని భక్తుల భయాలను తొలగించే కాలభైరవ స్వామి ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అంతకుముందు బెజ్జంకి ఎక్స్‌రోడ్డు వద్ద హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.