సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

26-11-2026 | 06:05pm
  1. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం మనందరి బాధ్యత 
  2. మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని

హుజురాబాద్,నవంబర్2616:(విజయక్రాంతి): భారత రాజ్యాంగం(Constitution of India) ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వాన్ని అందించిందని హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ముందుగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని బాలికల పాఠశాలలో అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.

రాజ్యాంగం అనేది కేవలం చట్టాల పుస్తకం మాత్రమే కాదని, ప్రతి పౌరుడి హక్కులకు రక్షణ కవచమని, సమానత్వానికి ప్రతీకగా, ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమేనని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం, సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని తెలిపారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ అర్చన, కౌన్సిలర్లు, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్లు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు