ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

16-10-2026 | 10:06pm

సీపీ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట రూరల్, అక్టోబర్ 16: మైనర్ బాలికపై(Minor girl) లైంగిక దాడికి(Sexual assault) పాల్పడిన కేసులో నిందితుడు మాసుల శేఖర్‌కు(Masula Shekhar) 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ సిద్దిపేట న్యాయమూర్తి వై. జయప్రసాద్ శుక్రవారం తీర్పును వెల్లడించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్(CP Rashmi Perumal) తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం 2022 జనవరి 8న సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాసుల శేఖర్ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి, సిద్దిపేట రూరల్ ఎస్ఐ వి. శంకర్, అప్పటి సీఐలు సురేందర్ రెడ్డి, జానకిరామ్ రెడ్డి సమగ్ర దర్యాప్తు నిర్వహించి, పూర్తి సాక్ష్యాధారాలను సేకరించారు. అనంతరం పటిష్టమైన అభియోగపత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేశారన్నారు.విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మరాములు న్యాయస్థానంలో వాదనలు వినిపించగా,ప్రస్తుత సిద్దిపేట రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్ఐ డి.నవత తదితరులు కేసు విచారణలో సమన్వయంతో సహకరించారు.

 సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిని దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు.

మరిన్ని వార్తలు