స్మృతి కెప్టెన్సీకి తొలి పరీక్ష
సారథిగా మొదటి సిరీస్‌కు రెడీ
నేడు జింబాబ్వేతో టీ20
రాయ్‌పూర్, అక్టోబర్ 15: భారత మహిళల క్రికెట్లో కొత్త శకం మొదలుకాబోతోంది. మహిళల జట్టు సారథిగా హర్మన్‌ప్రీత్‌కౌర్ ఇటీవలే తప్పుకోగా స్మృతి మంధాన(Smriti Mandhana)కు బాధ్యతలు అప్పగించారు. గతంలో పలుసార్లు కెప్టెన్సీ చేసినప్పటకీ స్మృతి పూర్తిస్థాయిలో పగ్గాలు అందుకోవడం ఇదే తొలిసారి. జింబాబ్వేతో పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఆమె ప్రయాణం మొదలుకాబోతోంది. రాయ్ పూర్ వేదికగా తొలి టీ ట్వంటీ శుక్రవారం జరగబోతోంది. ప్రత్యర్థి చిన్న జట్టే అయినప్పటకీ స్మృతి కెప్టెన్సీకి ఇది పరీక్షగా చెప్పొచ్చు.
వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచు కుని సెలక్టర్లు ఆమెకు సారథ్యం అప్పగించారు. జట్టు కూర్పును సిద్ధం చేసుకునేం దుకు స్మృతి ఈ సిరీస్ నుంచే అవకాశాలను అందుకోవాల్సి ఉంటుంది. తాత్కాలిక సారథిగా మంచి రికార్డే ఉన్న ఆమె డబ్ల్యూపీఎ ల్లో సైతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపింది. దీంతో సహజం గానే మంధానపై అంచనాలు ఉన్నాయి. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత్‌ను విజేతగా నిలిపి సారథిగా శుభారంభం చేయాలని స్మృతి భావిస్తోంది. కాగా ఈ సిరీస్ కోసం పలువురు యువ క్రికెటర్లకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. దీంతో తుది జట్టు కూర్పులో ఆమె ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందో చూడాలి.
భారత మహిళల టీ20 జట్టు: స్మృతి మంధాన (కెప్టన్), షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్ ప్రీత్‌కౌర్, హార్లీన్ డియోల్, హసబ్నిస్, దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), రిఛా ఘోష్, యాస్తిక భాటియా, వైష్ణవి శర్మ, నందిని శర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ్, సాయాలి సత్ఘారే, రేణుకా ఠాకూర్