మైనర్లకు మద్యం.. అధికారుల చోద్యం..!
- గరిడేపల్లి మండలంలోని వైన్‌షాపుల్లో మైనర్లకు మద్యం అమ్మకాలు!
- పల్లెలకు విస్తరించిన విష సంస్కృతి అంటూ ప్రచారం
- అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
- పర్మిట్ రూమ్లో అధిక ధరల వసూళ్లంటూ విమర్శలు
- ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టాలని పలువురు డిమాండ్
గరిడేపల్లి, అక్టోబర్ 25 : నిబంధనలు పాటించాల్సిన మద్యం విక్రయ కేంద్రాల్లోనే(Liquor retail outlets) నిబంధనల ఉల్లంఘన జరుగుతోందనే ఆరోపణలు గరిడేపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారాయి. అలాగే పర్మిట్ రూమ్లో అధిక ధరలకు తిను బండారాలు అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మద్యం నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మైనర్‌లకు మద్యం అమ్మకాలు..
మండల వైన్స్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సైతం మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలోని వైన్ షాప్ లో మైనర్లకు మధ్యమును విక్రయిస్తున్నారని వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
దీనిలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్ లో మైనర్ బాలుడు అని తెలిసిన ఎటువంటి నిబంధనలు పాటించకుండా స్వేచ్ఛగా మద్యం బాటిళ్లను అమ్మ అనే ప్రచారం జోరుగా సాగింది. మైనర్లకు మద్యం అందకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులతోపాటు సంబంధిత అధికారులపైనా ఉన్నప్పటికీ, మైనర్లకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
పర్మిట్ రూమ్లో అధిక ధరల బాదుడు?
వైన్స్ పక్కనే ఉన్న పర్మిట్ రూమ్లోనూ వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ మద్యం సేవించేవారు ఆహార పదార్థాలను అక్కడే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్స్ను ఎంఆర్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? విక్రయ కేంద్రంలో ధరల నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మద్యం నాణ్యతపై అనుమానాలు
మైనర్లకు మద్యం బాటిల్లు అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్న వైన్ షాప్ లో ఖరీదైన మద్యం బాటిళ్లలో నాసిరకం మద్యం నింపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
అధికారుల తీరుపై అనుమానాలు
వైన్ షాపులపై పలు ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనే అనుమానాలు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తూన్నారు. కొందరు అధికారులకు మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తుండడం గమనార్హం.
అధికారుల చర్యలు తీసుకోవాలని డిమాండ్
మైనర్లకు మద్యం విక్రయాలు, పర్మిట్ రూమ్లో అధిక ధరల వసూళ్లు, మద్యం నాణ్యతపై వస్తున్న ఆరోపణలపై జిల్లా స్థాయి ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా మైనర్లకు మద్యం విక్రయిస్తే ఆ ప్రభావం కుటుంబాల మనుగడ పై పడుతుందని కఠిన పర్యవేక్షణ చేపడుతూ ఆ విధానానికి తప్పక అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
మా దృష్టికి రాలేదు
నిబంధనల ప్రకారం మైనర్లకు మద్యం అమ్మకూడదు. మైనర్లకు మద్యం అమ్ముతున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. వైన్స్ పక్కన పర్మిట్ రూంలో అధిక ధరకు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అమ్ముతున్న విషయం మా పరిధిలోకి రాదు.
శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ హుజూర్‌నగర్