రైతు కన్నీటిలో ఓట్లు వెతకడం నీచ రాజకీయం

24-09-2026 | 05:30am
  1. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తున్నాం
  2. నీటి కొరతపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తోంది
  3. జూరాల నుంచి సాగునీటి విడుదలపై కర్ణాటక సీఎంతో చర్చలపై సానుకూల స్పందన
  4. బీఆర్‌ఎస్‌కు ఎల్ నినో రాజకీయ ఆయుధం
  5. కరువు రావాలని, పంటలు ఎండాలనే పైశాచికానందం ఆ పార్టీది
  6. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేరేడుచర్ల, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): రైతు కన్నీటిలో బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) ఓట్లు వెతకడం నీచ రాజకీయానికి నిదర్శనం అని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. వచ్చే వేసవిలో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందని వెల్లడించారు. అందులో భాగంగానే జూరాల(Jurala Project) నుంచి సాగునీటి విడుదల(Release of irrigation water)పై కర్ణాటక సీఎంతో జరిపిన చర్చలకు సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు.

సూర్యాపేట జిల్లా(Suryapet District) నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో రూ.26.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నేరేడుచర్ల డబుల్ రోడ్డును బుధవారం ప్రారంభించారు. అలాగే జానల్దిన్నె గ్రామపంచాయతీ భవనం(Janaldinne Gram Panchayat Building), నేరేడుచర్ల గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి కారణంగా ఏర్పడిన వర్షపాత లోటును కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రైతుల కష్టాన్ని రాజకీయ పెట్టుబడిగా మార్చుకోవడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష లక్షణం కాదని మండిపడ్డారు. ‘ఎల్ నినో అనేది కాంగ్రెస్ కార్యాలయంలో పుట్టిన పదం కాదు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేసే శాస్త్రీయ పరిణామం. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే వేడెక్కినప్పుడు ప్రపంచ వాతావరణ నమూనాలు మారుతాయి.

భారత రుతుపవనాలపైనా దాని ప్రభావం పడుతుంది. ఈసారి కొన్ని కీలక దశల్లో వర్షపాతం దాదాపు 40 శాతం వరకు తగ్గింది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ప్రభుత్వంపై విషప్రచారం చేయడం బీఆర్‌ఎస్ రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం’ అని విమర్శించారు. ఆకాశంలో ఎల్ నినో వర్షాలను అడ్డుకుంటే భూమిపై బీఆర్‌ఎస్ అబద్ధాల వరద పారిస్తోందని విమర్శించారు.

పొలం ఎండితే మాకు బాధ.. బీఆర్‌ఎస్‌కు అవకాశం

‘రైతు పొలంలో పంట ఎండిపోతే ప్రభుత్వానికి బాధ కలుగుతుంది, బీఆర్‌ఎస్‌కు మాత్రం రాజకీయ అవకాశం కనిపిస్తోంది. జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ సాగు చేసిన పంటలను కాపాడటం, రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తోంది. సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని వెతికేది కాంగ్రెస్ ప్రభుత్వం. సమస్య మరింత పెరగాలని కోరుకునేది బీఆర్‌ఎస్. మేము రైతు పంటను కాపాడేందుకు నీళ్ల కోసం రాష్ట్రాల తలుపులు తడుతున్నాం. వాళ్లు మాత్రం హైదరాబాద్‌లో కూర్చొని అబద్ధాల వరద పారిస్తున్నారు’ అని దుయ్యబట్టారు. 

పంటలను కాపాడేందుకు కృషి

జూరాల ఆయకట్టు కింద సాగు చేసిన పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించే అంశంపై ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. తనకున్న వ్యక్తిగత స్నేహాన్ని తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం వినియోగించానని చెప్పారు. తెలంగాణ విజ్ఞప్తికి డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారని, నీటి లభ్యతను పరిశీలించి సహకరించేందుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ‘మేం కర్ణాటకతో మాట్లాడి నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.

బీఆర్‌ఎస్ నేతలు మాత్రం రైతుల వద్దకు వెళ్లి భయం సృష్టిస్తున్నారు. మాకు రాజకీయాల కంటే పంటలు ముఖ్యం, ప్రచారం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం’ అని స్పష్టం చేశారు. ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతుందని చెప్పారు.

అవసరమైన చోట నీటి విడుదల, ప్రత్యామ్నాయ వనరుల వినియోగం, జలాశయాల సమర్థ నిర్వహణపై నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సాగు చేసిన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనాథలుగా వదిలిపెట్టమని, రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వేసవిలో ప్రజల గొంతు ఎండకుండా మంచినీటి సరఫరాకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. 

ఈ ప్రాంతంతో నాది ఆత్మీయ బంధం 

హైదరాబాద్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సన్నాహక సమావేశం ఉన్నప్పటికీ నేరేడుచర్ల రహదారి ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా హాజరయ్యానని మంత్రి తెలిపారు. ఈ రహదారిని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంతో నాకు ఉన్నది కేవలం రాజకీయ సంబంధం కాదుప్రజలతో పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధం అన్నారు.

కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ కాంతం చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్‌రెడ్డి, మేడారం సర్పంచ్ పారేపల్లి సత్యనారాయణ, జానలదిన్నె సర్పంచ్ గజ్జి సరిత, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీకాంత్, నేరేడుచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ప్రకాష్, పాలకవీడు మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, యువనాయకులు చలసాని రాజీవ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు