జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి ఘన సన్మానం
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ చేతుల మీదుగా సత్కారం
‘బేటీ బచావో.. బేటీ పడావో’ లోగో దుస్తులు, క్రికెట్ బూట్ల అందజేత
సూర్యాపేట, అక్టోబర్ 26 (విజయక్రాంతి): జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారిణి మణిమద్దె పల్లవిని సోమవారం జిల్లా కలెక్టరేట్లో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandlal Pawar), ఎస్పీ నరసింహ ఆమెను శాలువాతో సత్కరించి, ‘బేటీ బచావో.. బేటీ పడావో’ లోగోతో కూడిన క్రీడా దుస్తులు, బూట్లను అందజేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని, పట్టుదలతో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూసీఓ నరసింహారావు, కేంద్ర సమన్వయకర్త చైతన్య, పీడీ మీసాల కిరణ్, పల్లవి తండ్రి రామకృష్ణ ,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.