ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చి తమ సహకారాన్ని అందించాలని మాజీ ఎంపిటీసి నందం గణేష్ బాబు(Former MPTC Nandam Ganesh Babu) పిలుపు నిచ్చారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘మన బడులు-మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దాత, ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు సహకారంతో పాఠశాల వాతావరణం మార్పుకు శ్రీకారం చుట్టారు.
గణేష్ బాబు సహకారంతో పాఠశాల తరగతి గదులు, ప్రహరీ గోడ, ఆవరణం మొత్తానికి రంగులు వేయించారు. ఈ పనులను దాత నందం గణేష్ బాబు, స్థానిక మాజీ ఎంపీటీసీ చిలుగూరి గోపాల్ రెడ్డి, స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్యలు సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైనప్పుడే పేద, సామాన్య కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు.
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, దాతలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహకరిస్తే ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రజలను భాగస్వాములను చేస్తూ స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేపడుతున్న ‘మన బడులు-మన బాధ్యత’ కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసు, ఉపాధ్యాయులు లక్ష్మీ కల్పన, ఎం. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.