ఎల్‌నినోకు రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవాలి..
- రాజకీయాలను ప్రక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలి..
- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ..
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ..
యాదగిరిగుట్ట (విజయకాంతి): ఎల్ నీ నో ప్రభావంతో ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని మనదేశంలో కూడా ప్రభావం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరు నెలల క్రితం ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఖర్చులు తగ్గించుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారని రాష్ట్ర ప్రభుత్వం ఎల్ ని నో పై నివారణ చర్యలు చేపట్టడంలో జాప్యం చేస్తుందని దీనివల్ల రానున్న రోజుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఎల్ నీనో పై నివారణ చర్యలు చేపట్టారని మాజీ గవర్నర్, మాజీ కేంద్రం మంత్రి బండారు దత్తాత్రేయ(Former Governor Dattatreya) అన్నారు.
ఆదివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. గర్భాలయంలో పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలను మానాలని, వెంటనే అఖిలపక్షాన్ని పిలిచి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎల్ ని నో ను ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రజలను ఏ విధంగా చైతన్యం చేయాలని సమీక్షించాలని అన్నారు. ఎల్ నీ నో పై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ఒక మాట రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకుంటూనే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం వారికి ఆనవాయితీగా వస్తుందని ఇది మంచి పరిణామం కాదని అన్నారు.
ముఖ్యమంత్రులుగా పని చేసిన కొందరు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మి సంక్షేమ పథకాలకు వెచ్చించారని అది వారి పతనానికి కారణం అయిందని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను అమ్మాలని చూస్తే వారికి కూడా ప్రజాక్షేత్రంలో నష్టపోక తప్పదని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందరినీ కలుపుకొని సూచనలు సలహాలు తీసుకొని పరిపాలన సాగిస్తే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్, జిల్లా నాయకులు కాదూరి అచ్చయ్య, మండల నాయకులు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు కర్రే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.