ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి

02-11-2026 | 07:24pm

158 అర్జీలు స్వీకరణ.. క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే సమస్యలు పరిష్కరించాలి : రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

ఆలేరు, నవంబర్ 2 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో(Prajavani program) ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి(Additional Collector (Revenue) Venka Reddy) ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మతో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 158 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. స్వీకరించిన అర్జీల్లో రెవెన్యూ శాఖకు 102, హౌసింగ్‌కు 12, ఉపాధి కల్పనకు 7, ఎస్సీ కార్పొరేషన్‌కు 5, గ్రామీణాభివృద్ధి శాఖకు 4, సర్వే అండ్ ల్యాండ్స్‌కు 4, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు 4, మండల పరిషత్‌కు 3, విద్య, వైద్య ఆరోగ్య, మున్సిపాలిటీ, పంచాయతీ శాఖలకు రెండేసి చొప్పున వచ్చాయి.

మైన్స్, విద్యుత్, సివిల్ సప్లై, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఈడీఎం, వ్యవసాయ, సంక్షేమ, ఇరిగేషన్ శాఖలకు ఒక్కో అర్జీ అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ సాత్విక్, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు