టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడిన మంత్రి శ్రీధర్ బాబు

25-11-2026 | 06:15pm

నాణ్యతతో పుష్కర ఘాట్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

త్వరలో అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీఐ భవనం ప్రారంభోత్సవంలో మంత్రి

మంథని, నవంబర్ 25 (విజయక్రాంతి): మంథని పట్టణంలోని కళాశాల మైదానంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) బుధవారం ఉదయం సందడి చేశారు. కొద్దిసేపు వాకింగ్ చేసిన మంత్రి అనంతరం టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహంగా గడిపారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన చాటిచెప్పారు. అనంతరం గోదావరి నది తీరానికి చేరుకున్న మంత్రి పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలిన నిర్మాణాల పురోగతిని అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పుష్కర ఘాట్ పనులను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని, భక్తులు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోకుండా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. మంథనికి అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీఐ విద్యాసంస్థను తీసుకువచ్చామని, భవన నిర్మాణం త్వరలో పూర్తిచేసి ప్రారంభిస్తామని వెల్లడించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ అందించడమే లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

మరిన్ని వార్తలు