యాదాద్రిని కరువు జిల్లాగా ప్రకటించాలి: ఏఐకేఎంఎస్
ఆలేరు, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం(El Nino effect)తో వర్షాలు సరిగా కురవక యాదాద్రి జిల్లా(Yadadri District)లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ అన్నారు. ఆలేరులో నిర్వహించిన ఏఐకేఎంఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి, రైతులకు పంట నష్టపరిహారం, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో నెలకొన్న లో-వోల్టేజ్, విద్యుత్ సమస్యలను పరిష్కరించి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని కోరారు.
గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడాల సోమయ్య, ఇక్కిరి సహదేవ్, రాజయ్య, బాల మల్లేష్, మోతిలాల్, రాఘవరెడ్డి, రామచంద్రు, గోపాల్‌రెడ్డి, మురళి, పాకాల నరేష్, సరిత, మేకల వెంకటేష్, అన్రెడ్డి బాల్‌రెడ్డి, మంకయ్య, అంజిరెడ్డి, మషయ్య తదితరులు పాల్గొన్నారు.