ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుకై సర్వే

21-10-2026 | 04:51pm

బోథ్ అక్టోబర్ 21 (విజయక్రాంతి): అదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్(Railway Line) ఏర్పాటు విషయమై సర్వే పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఆదిలాబాద్, ఆర్మూర్ రైల్వే లైన్ పనులు ఆదిలాబాద్ నుండి జాతీయ రహదారి సమీప గ్రామాలను కలుపుతూ సర్వే నిర్వహించారు. అయితే అందులో నుండి ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ పనుల్లో 70 కిలోమీటర్లు మార్పు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే సర్వే పనులు చేపడుతున్నట్లు సమాచారం.

గతంలో ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సర్వే పనులు ఆదిలాబాద్ నుండి నేరడిగొండ మండలం మీదుగా కొనసాగాయి. అయితే తాజాగా 70 కిలోమీటర్లు ఆదిలాబాద్ నుండి బరంపూర్ మీదుగా బజార్హత్నూర్ ,సోనాల మండలాలను కలుపుతూ బోత్ మండలంలోని కుచలాపూర్ మీదుగా సర్వే పనులు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి ఉండగా రైల్వే ఏర్పాటు వల్ల లాభం లేదని అధికారులు మారుమూలన ఉన్న మండలాలను కలుపుతూ సర్వే పనులు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ రూట్లో రైల్వే లైన్ ఏర్పాటు అయితే మారుమూల గ్రామల ప్రజలకు రైలు మార్గం ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఈ రూట్లో సర్వే పనులు కొనసాగిస్తున్నట్లు సమాచారం..

భవిష్యత్తులో హై స్పీడ్ ట్రైన్లు...

నూతనంగా ప్రతిపాదించిన ఈ రైల్వే లైన్ మీదుగా హై స్పీడ్ ట్రైన్లను సైతం నడిపే అవకాశం ఉందని తెలిసింది. ఆర్మూర్ నుండి ఔరంగాబాద్ ,నాందేడ్, పూనా వంటి నగరాలను కలుపుతూ వెళ్లేందుకు హై స్పీడ్ ట్రైన్ లను నడిపించే ఆస్కారం ఉందని అంటున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం. ఏది ఏమైనా భవిష్యత్తులో మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రైలు మార్గం ద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడే ఆస్కారం ఉందని పరిశీలకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు