రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. మళ్లీ అమ్మహస్తం!
తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రేషన్ కార్డుదారులకు రాయితీ ధరలకే సరుకులు అందించాలని యోచిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ధరలు మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం దృష్టి సారించింది.
గతంలో అమలైన ‘అమ్మహస్తం’ పథకం తరహాలో నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు అందించే విధానాన్ని మళ్లీ తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం పరిశీలన తర్వాత ఈ పథకంపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న రేషన్ కార్డుదారులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది.