చెన్నైలో భారీ వర్షాలు.. 5 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు (Heavy Rainfall) కురుస్తున్నాయి. చెన్నైలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. సాలిగ్రామం, టి.నగర్, వలసరవాక్కం, గిండి ప్రాంతాల్లో వర్షపు నీరు (Waterlogging) రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో విద్యాసంస్థలకు (Educational Institutions) సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు, వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.