హాజరు శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు
రిమ్మ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు...
ఉట్నూర్, నవంబర్ 05( విజయక్రాంతి ): సిరికొండ మండలంలోని రిమ్మ ఆశ్రమ పాఠశాలను(Rimma Ashram School) సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు(ITDA Project Officer Manda Makarandu) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, తరగతుల నిర్వహణ, బోధనా పద్ధతులు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకొని ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, పిల్లల విద్యాభ్యాసంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.
ఉపాధ్యాయులు ప్రతిరోజూ విద్యార్థుల హాజరును క్రమం తప్పకుండా నమోదు చేయాలని, తరచుగా పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను నేరుగా కలిసి పాఠశాలకు పంపించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల విద్యా ప్రగతిపై చర్చించాలని సూచించారు.
అదేవిధంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచుతూ విద్యార్థులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని, బోధనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని తెలిపారు. అతిథి ఉపాధ్యాయుల కొరత ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లోని ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు అధికారులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు స్పష్టం చేశారు. ఈ తనిఖీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.