నిండు గర్భిణిని వాగు దాటించిన సర్పంచ్

05-11-2026 | 04:57pm
  1. ప్రజల నుండి,అధికారుల నుండి ప్రశంసల వెల్లువ.
  2. ప్రాణాలకు తెగించి మరీ గర్భిణికి అండగా నిలిచిన మూకమామిడి సర్పంచ్.

ములకలపల్లి,నవంబర్ 5(విజయక్రాంతి): మురసు తుఫాను(Murasu cyclone) వల్ల గత రెండు రోజులుగా కురిసిన ఎడతెరిపిలేని భారీ వర్షానికి వాగు ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.మూకమామిడి - మొగరలగుప్ప గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది.

ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే మొగరలగుప్ప గ్రామానికి చెందిన ఒక మహిళకు గురువారం పురుడు నొప్పులు ప్రారంభమయ్యాయి.ఆస్పత్రికి వెళ్లాలంటే తెగిపోయిన వంతెన దాటి, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉండగా,విషయం తెలుసుకొని వెంటనే మూకమామిడి గ్రామపంచాయతీ సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

తానే స్వయంగా దగ్గరుండి...

ప్రాణాలకు తెగించి,వరద నీటిలోకి దిగి,గ్రామస్తులు,యువకుల సహాయంతో నిండు గర్భిణిని సురక్షితంగా వాగు దాటించారు.ప్రమాదాల అంచుల నుండి ఆమెను ఒడ్డుకు చేర్చి ఆస్పత్రికి పంపించే ఏర్పాట్లు చేశారు.సర్పంచ్ చూపిన తెగువ,మానవత్వం చూసి గ్రామస్తులందరూ అభినందించారు.

గత రెండు రోజులుగా రాత్రి,పగలు తేడా లేకుండా,వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పంచాయతీ ప్రజల కోసం సర్పంచ్ ఆదిలక్ష్మి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు.వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడటం నుండి,తెగిపోయిన వంతెన వద్ద ప్రజలను అప్రమత్తం చేయడం వరకు ప్రతి చోటా ముందుండి సేవ చేస్తున్నారు.

సర్పంచ్ మానవత్వపూర్వక సేవను చూసి గ్రామస్తులు,యువకులు,మహిళలు,ప్రజలు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.అధికారులు సైతం సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మిని ప్రత్యేకంగా అభినందించారు.ఇలాంటి సర్పంచ్ ఉండటం మా అదృష్టం అంటూ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఆపదలో వెన్నంటుండే నాయకురాలుగా సర్పంచ్ మరోసారి నిరూపించుకున్నారని ప్రజలు కొనియాడుతున్నారు.

మరిన్ని వార్తలు