కదిలే బస్సులో డోర్లు మూసేయాల్సిందే!

05-11-2026 | 04:08pm

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బస్సులు కదులుతున్న సమయంలో డోర్లు (Bus Doors) తప్పనిసరిగా మూసి ఉంచాలని అన్ని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. బస్సుల్లో డోర్ల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే మరమ్మతులు చేపట్టాలని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం స్పష్టం చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్టోబర్ 25న చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ప్రయాణికురాలు తోసేయడంతో కండక్టర్ గుండ్ల ప్రవళిక తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపడంతో పాటు ఆర్టీసీ సిబ్బంది భద్రత, ప్రయాణికుల రక్షణపై మరోసారి చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ (Transport Safety) అధికారులు అప్రమత్తమయ్యారు. బస్సులు ప్రయాణంలో ఉన్నప్పుడు డోర్లు తెరిచి ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించి, వాటిని తప్పనిసరిగా మూసి ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి డిపో పరిధిలోని బస్సుల్లో డోర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది మెకానికల్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

అలాగే డోర్లలో సాంకేతిక సమస్యలు (Technical Issues) గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. బస్సులు డిపోల నుంచి బయటకు వెళ్లే ముందు కూడా అవసరమైన తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ప్రవళిక ఘటన పునరావృతం కాకుండా ఉండటంతో పాటు ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. ఇకపై అన్ని డిపోల్లో ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ ఆదేశించింది.

మరిన్ని వార్తలు