విద్యార్థులకు స్టూడెంట్ కిట్ అందించాలి
విద్యార్థులకు ఆధార్ అనుసంధానం చేస్తూ ఫేస్ రికగ్నెన్షన్ సిస్టం నందు నమోదు చేయాలి: ఐటీడీఏ పీవో బి.రాహుల్
దమ్మపేట, నవంబర్ 05(విజయ క్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department) ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నందున ప్రభుత్వం సరఫరా చేసిన స్టూడెంట్ కిట్ ప్రతి విద్యార్థికి అందించేలా సంబంధిత వార్డెన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు.
గురువారం మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం వలన పాఠశాలలోని ఆవరణలో నీరు బయటికి పోయే మార్గం లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నదని, అలాగే పాతబడిన బిల్డింగ్ అయినందున వర్షం పడే సమయంలో గోడలకు పూర్తిగా చెమ్మ రావడం వలన కరెంట్ షాక్ వస్తున్నదని వార్డెన్ పి ఓ దృష్టికి తీసుకొని వచ్చారు.
ఈ సందర్భంగా పిఓ వసతిగృహాల్లోని గదులు, డైనింగ్ హాల్ డార్మెటరీ హాస్టల్ ఆవరణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్ ఆవరణలో డ్రైనేజీ సమస్య వలన నీరు బయటకు పోవడం లేదని, నీరు నిలవకుండా చూడాలని, అలాగే ప్రస్తుతం పాత బిల్డింగ్ అవ్వడం వలన ఇటువంటి సమస్యలు వస్తున్నాయని అందుకు పిల్లలకు ఇబ్బందులు కలగకుండా, కరెంటు సమస్య, డ్రైనేజీ సమస్య, వర్షపు నీరు కురవకొండ తాత్కాలిక మరమ్మతులు చేయించాలని సంబంధిత ఏ ఈ లకు ఆదేశించారు.
త్వరలో పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కట్టడానికి దానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి తనకు సమర్పించాలని ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ కు ఆదేశించారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం సరఫరా చేసిన స్టూడెంట్ కిట్ తప్పనిసరిగా ఇవ్వాలని, ప్రతి పిల్లవానికి ఆధార్ అనుసంధానం చేస్తూ ఫేస్ రికగ్నిషన్ సిస్టం నందు తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు.
వర్షాల వలన వాగులు, వంకలు, చెక్ డ్యాములు పొంగిపొర్లుతున్నందున వాటిని చూడడానికి పిల్లలను ఎవరిని పంపకూడదని, రాత్రిపూట పిల్లలు ఎవరు బయటికి రాకుండా చూడాలని వార్డెన్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, డి ఈ బాపనయ్య, ఏ ఈ సుబ్బరాజు, వార్డెన్ కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.