అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం
వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర స్వామి శాస్త్రి మందిరం(Sri Venkateswara Swamy Shastri Mandiram) ఆలయ వారికోత్సవం వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం జరిగిన రథోత్సవంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar ) పాల్గొన్నారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ రథోత్సవానికి ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి పుర వీధుల్లో శోభాయాత్రగా ఊరేగించారు. పట్టణ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల గోవిందా నామస్మరణ నడుమ రథోత్సవం కన్నులపండువగా సాగింది. ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ జోగు శైలజా రవి, బోడిగాం శ్రీకాంత్, నాయకులు రవికాంత్, మనోజ్, జీవన్, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.