ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన
గంగాపురంలో కేతి బచావో అభియాన్..
జడ్చర్ల: జడ్చర్ల మండలం(Jadcherla mandal) గంగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేతి బచావో అభియాన్లో(Kheti Bachao Abhiyan) భాగంగా రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకురాలు(Assistant Director of Agriculture) విజయ నిర్మల మాట్లాడుతూ..నేల ఆరోగ్యాన్ని కాపాడటం,సమతుల్య ఎరువుల వినియోగం,నేలలో కర్బన్ శాతం పెంపు,నీటి పరిరక్షణ,రైతుల ఆదాయం పెంపు,పర్యావరణ పరిరక్షణ వంటి ఆరు అంశాలపై రైతులకు వివరించారు.
ఎల్నినో ప్రభావం ఫిబ్రవరి, మార్చి నెలల వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికల ఆధారంగా వివరించారు. యాసంగిలో వరి సాగుకు బదులుగా జొన్న,పెసర, మినుము,ఆముదం, కూరగాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన డ్రిప్ పైపులను రాయితీపై అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోపినాథ్, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి శేఖర్,ఉద్యానవన విస్తరణ అధికారి వీరన్న,వార్డు సభ్యులు ఖదీర్,మల్లికార్జున్, రైతులు కె. శ్రీనివాసులు, రాములు,శంకర్, భీమస్వామి తదితరులు పాల్గొన్నారు.