2028లో తెలంగాణ సీఎం బీసీనే

23-09-2026 | 05:05am

బీసీ రాజ్యాధికార యాత్రలో తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణలో 2028లో బీసీనే సీఎం అని, బీసీ రాజ్యాధికారమే లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అన్నారు. బీసీ రాజ్యాధికార యాత్ర(BC Political Empowerment Yatra) ఆరో రోజు పరిగి నియోజకవర్గానికి చేరుకుంది. పరిగిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. 2028లో తెలంగాణ గడ్డపై బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని ప్రకటించారు.

2014లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే(Comprehensive Family Survey)లో తెలంగాణలో బీసీల జనాభా 2 కోట్లకు పైగా ఉన్నట్లు తేలిందని, ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో మాత్రం బీసీల జనాభాను 1 కోటి 80 లక్షలుగా చూపించారని అన్నారు. పదేళ్ల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది బీసీలను తగ్గించారని అన్నారు. అంతమంది చనిపోయి ఉంటే వారి డెత్ సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో కేసీఆర్ నిర్వహించిన సర్వేలో 10.06 లక్షలుగా ఉన్న రెడ్ల జనాభాను రేవంత్ రెడ్డి ప్రభుత్వ సర్వేలో 15 లక్షలకు పెంచి చూపించారని, సుమారు 7 లక్షల పెంపు చూపించారని మల్లన్న పేర్కొన్నారు. బీసీల సంఖ్య ను తగ్గించి, రెడ్ల సంఖ్యను పెంచి చూపించారని అన్నారు.   అత్యధిక సంఖ్యలో బీసీల ఓట్లు ఉన్నప్పటికీ రాజకీయ అధికారం మాత్రం బీసీలకు దక్కడం లేదన్నారు. బీసీలు తమ ఓటు శక్తిని గుర్తించాలని, తమ ఓట్లతో తమ వర్గాల నాయకులను చట్టసభలకు పంపించాలని పిలుపునిచ్చారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేసిన మల్లన్న, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయలేదని ఆరోపించారు. బట్ల చందారంలో బీసీలకు చెందిన 235 ఎకరాల 6 గుంటల పట్టా భూములను పారిశ్రామిక పార్కుల పేరుతో తీసుకున్నారని, అదేవిధంగా కాలాపూర్ గ్రామంలో 165 ఎకరాల భూములను తీసుకున్నారని తెలిపారు.

తరతరాలుగా భూములను నమ్ముకుని జీవిస్తున్న బీసీ కుటుంబాల జీవనాధారాన్ని దెబ్బతీయడం సరికాదని, బీసీల భూములు, హక్కుల విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరా టం చేస్తుందని చెప్పారు.  ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రస్తావించిన మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ బహుజన వర్కర్స్ యూనియన్ రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలిపారు. 59 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఓసీ నాయకులను అసెంబ్లీ గేటు దాటనివ్వబోమని మల్లన్న సవాల్ చేశారు. కత్తెర గుర్తుకు ఓటేసీ టీఆర్పీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు