ఆదివాసి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని భారీ ధర్నా.

16-09-2026 | 09:20pm

ఎస్టీ జాబితా నుండి  లంబాడాలను తొలగించాలని డిమాండ్

కొమరం భీమ్ కాంప్లెక్స్ నుండి  ఐటీడీఏ వరకు శాంతియుతంగా ర్యాలీ

ఉట్నూర్ బంద్.. రెండున్నర గంటల పాటు  నిలిచిపోయిన రాకపోకలు

ఇబ్బందులు పడ్డ  సుదూర ప్రాంత ప్రయాణికులు

ఉట్నూర్,(విజయక్రాంతి): ఐదో షెడ్యూల్ ప్రాంతమైన ఏజెన్సీలో 100% ఉద్యోగాలు ఆదివాసి గిరిజనులు(Aboriginal tribes) కేటాయించాలని తుడుం దెబ్బ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నక్ విజయ్ కుమార్, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పుర్కా బాపురావు ల తో పాటు రాష్ట్ర శాఖ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉట్నూరులో  ఆదివాసి హక్కుల పోరాట సమితి  తుడుం దెబ్బ, ఆదివాసి విద్యార్థి సంఘం(Adivasi Student Association) ఆధ్వర్యంలో ఊట్లూరులోని కొమరం భీము కాంప్లెక్స్ లో  ఆదివాసీ పోరాట యోధుడు  కొమరం భీమ్  విగ్రహానికి  పూలమాలలు వేసి  భారీ ర్యాలీ ఐటీడీఏ వరకు  చేపట్టారు.

ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఐటీడీఏ వరకు  శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏకు చేరుకొని  ధర్నా ను రెండున్నర గంటలకు పైగా  కొనసాగించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు  మాట్లాడుతూ 1976లో రాజ్యాంగ విరుద్ధంగా  ఎస్టీ జాబితాలో చేరిన  లంబాడాలు  దశాబ్దాలుగా  కొల్లగొడుతున్నారని అన్నారు. ఐటీడీఏ లో ప్రత్యేక అధికారాలు గల  ఐటిడిఏ పిఓ లకు ఏకఛత్ర  పాలన లేకుండా పోయిందని తెలిపారు. జీవో 57 ప్రకారం  ఐటీడీఏ ఆధ్వర్యంలో  29 ప్రభుత్వ శాఖలలో  పిఓ సింగల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమలు కు ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.

ఆదివాసులు సాగు చేస్తున్న  పోడు భూములకు  పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన  అడవి శాఖ అధికారులు అరాచకాలతో  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం  నిలిచిపోయిందన్నారు. అడవిలో  జీవనం సాగించే ఆదివాసుల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో  ప్రభుత్వం పూర్తిగా విప్లమైందని ఆరోపించారు. ఏజెన్సీ జీవో 141 ప్రకారం ఏజెన్సీ,కుల దృవప్రతాలు  జారీ చేయవద్దని  ఉత్తర్వులు ఉన్న  రెవిన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.  

గోండ్ వాన రాజ్యం కోసం పోరాటం చేస్తాం

రాష్ట్ర శాఖ అధ్యక్షుడు  డాక్టర్ మైపతి అరుణ్ కుమార్

ప్రత్యేక తెలంగాణ సాధన తర్వాత ఆదివాసులకు ఉద్యోగాలు కల్పించే జిఓ 3 ను రద్దు చేయడంతో పాటు  ఆదివాసుల అభివృద్ధి కుంటుపడుతుందని, ఆదివాసుల మొనగాడు కొరకు  గోండ్ వాన రాజ్యం సాధన కోసం పోరాటం చేస్తామని  తుడుం దెబ్బ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన కోసం  చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా గోండ్ వాన  రాజ్యం కోసం ఉద్యమం  పోరాటం సాగిస్తామన్నారు. డిసెంబర్ ఒకటో తేదీలోగా ఆదివాసుల సమస్యలు పరిష్కరించకుంటే  రాష్ట్ర రాజధానిలో భారీ సభ నిర్వహిస్తామని అన్నారు.

నిలిచిన రాకపోకలు.. ప్రయాణికుల ఇబ్బందులు

ఆదివాసీ గిరిజనులు తమ హక్కుల కోసం  చేస్తున్న ధర్నా సందర్భంగా ఇంద్రవెల్లి నుండి ఉట్నూర్ మీదుగా  మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని  గుంటూరు, నెల్లూరు  తదితర సుదూర ప్రాంతాలకు  ప్రయాణించే ఆర్టీసీ బస్సులు రెండున్నర గంటల పాటు  ఉట్నూర్ క్రాస్ రోడ్ వద్ద  నిలిచిపోయాయి. మంచిర్యాల వైపు నుండి  అదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చే ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు  ఉట్నూర్ మండలంలోని  కొత్తగూడెం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద  వాహనాలు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కనీసం తాగునీరు దొరకలేదు.

ర్యాలీ కి భారీ బందోబస్తు

తుడుం దెబ్బ ఆధ్వర్యంలో  నిర్వహించే ఆదివాసి మార్చ్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  ఆధ్వర్యంలో  భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీ గిరిజనులు  చేపట్టిన ర్యాలీలో పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బంధవస్తు పర్యవేక్షణలో  ఉట్నూర్ ఏఎస్పీ  రిత్విక్ సాయి కొట్టే, ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, సిఐలు ఎస్ఐలు , పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు